ప్రమాదకరంగా మూలమలుపు
-రోడ్డుకు అడ్డంగా ముళ్ళ పొదలు
-ఆదమరిస్తే తిరిగిరాని లోకాలకే
పెద్దేముల్ అక్టోబర్ 11(ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని ఆయా ప్రాంతాలలో రోడ్ల వెంబడి మూలమలుపులు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా పెద్దేముల్ మండల పరిధిలోని “బుద్ధారం వాగు వంతెనకు” 100 మీటర్ల దూరంలో, తాండూర్ నుండి వచ్చే మార్గంలో ఎడమవైపున ఉన్న మూలమలుపు… ప్రమాదకరంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే లోపే ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంది. నిత్యం పెద్దేముల్ మీదుగా తాండూర్, వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. తాండూర్ వెళ్లే మార్గంలో, బుద్ధారం వాగుకు సమీపాన ఎడమవైపున రోడ్డు మొత్తం గుంతలు పడడంతో.. వాహనదారులు కుడి వైపు నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తాండూర్ నుండి వచ్చేటప్పుడు ఎడమవైపు పెద్దేముల్ గ్రామానికి చెందిన “కమలాపురం రాంచంద్రి” పొలం దగ్గర, మూలమలుపు ఉండడంతోపాటు, చెట్లు, ముళ్లపొదలు ఏపుగా పెరిగి.. రోడ్డుకు అడ్డు రావడంతో, రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఒకరికొకరు కనిపించక, ఘోర రోడ్డు ప్రమాదం జరిగే ప్రమాదం పొంచి ఉంది.గతంలో ఇదే స్థలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే. కాబట్టి అధికారులు ప్రత్యేక చొరవ చూపి మూలమలుపు వద్ద, రోడ్డుకు అడ్డంగా పెరిగిన ముళ్ళపొదలను, చెట్లను తొలగించి ప్రమాదాలను అరికట్టాలని వాహనదారులు అధికారులు కోరుతున్నారు.
