అభివృద్ధిని పట్టించుకోని గత పాలకులు
-అక్రమ డబ్బుకు ఆశపడటం చరిత్రలో లేదు
-తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు, అక్టోబరు 13(ప్రజాక్షేత్రం):గత పాలకులు పదవులు అడ్డుపెట్టుకొని హైదరాబాద్‌లో ఉంటూ ఎంజాయ్ చేసి అభివృద్ధి గురించి ఆలోచించిన పాపన పోలేదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను గత పాలకుల మాదిరిగా కాకుండా వారానికి మూడు, నాలుగు రోజులు తాండూరులోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నానని గుర్తు చేశారు. తనకు వ్యాపారాలు ఉన్నందున ఆర్థికంగా బాగానే ఉన్నానని, అక్రమంగా డబ్బు తీసుకోవడం తన రాజకీయ చరిత్రలోనే లేదన్నారు. పదవులు ఇస్తానని తానెప్పుడు ఎవరికీ మాట ఇవ్వలేదని గ్రౌండ్‌లో పని చేసే వారికి పదవులు ఇచ్చినట్లు తెలిపారు. అక్రమ ఇసుక, మైనింగ్ అనేది పెద్ద బోగసని ఆయన కొట్టి పారేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న గత పాలకులకు రోడ్లు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఆరు నెలల్లో నర్సింగ్ కళాశాల పనులు పూర్తి చేస్తామని, దౌలాపూర్‌లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. 25 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ఈఎస్‌ఐ ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గత పాలకులు పట్టించుకోని కోట్‌పల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి, స్పీకర్ సహకార ంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు.