తమ భూముల్లో నుండి శవాన్ని తీసుకెళ్లొద్దు
జమ్మికుంట అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామవాసి సంపంగి సమ్మయ్య అనారోగ్యంతో మంగళవారం మరణించాడు. గ్రామంలోని చెరువు సమీపంలో ఉన్న స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయడానికి అంతిమయాత్రంగా వెళుతున్న వారిని తమ పట్టా భూముల్లో నుండి శవాన్ని తీసుకెళ్ల వద్దంటూ రైతులు అభ్యంతరము తెలిపారు. దీంతో మృతుని బంధువులు పోలీసులకు సమాచారము ఇచ్చారు. బ్లూ కోట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అంతిమయాత్రను కొనసాగించి దహన సంస్కారాలు చేయించారు. తమ గ్రామంలో మరణించిన వారికి స్మశాన వాటికకు తీసుకెళ్లాలంటే దారి లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్మశాన వాటికకు దారి చూపాలంటూ మండల తహసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు. కాగా స్మశాన వాటిక సమీపంలో ప్రజా ప్రతినిధులు కొంత స్థలాన్ని కొనుగోలు చేసి, దానికి కొంత చెరువు శిఖాన్ని ఆక్రమణ చేసి రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.