రాత్రివేళ నిద్రలేపి.. ఆస్పత్రిలో ఉన్న రోగులకు బీజేపీ సభ్యత్వం
హైదరాబాద్ అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం):ఆస్పత్రిలోని కంటి రోగులను ఒక వ్యక్తి రాత్రి వేళ నిద్ర లేపాడు. మొబైల్ ఫోన్‌లో వారి వివరాలు నమోదు చేసి బీజేపీ సభ్యులుగా చేర్చుకున్నాడు. ఒక రోగి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో ఈ సంఘటన జరిగింది. రాజ్‌కోట్‌లోని రాంచోడ్ దాస్ ట్రస్ట్ హాస్పిటల్ వార్డులో కంటికి శస్త్ర చికిత్స కోసం సుమారు 350 మంది రోగులు ఉన్నారు. రాత్రివేళ వారు నిద్రిస్తుండగా ఒక వ్యక్తి ఆ వార్డులోకి వచ్చాడు. మొబైల్ ఫోన్‌లో వారి వివరాలు నమోదు చేశాడు. వారి మొబైల్‌కు ఓపీటీ వచ్చింది. ఆ తర్వాత ‘మీరు బీజేపీ సభ్యులయ్యారు’ అన్న మెసేజ్ అందింది. ఒక రోగి దీని గురించి నిలదీయగా ‘బీజేపీ సభ్యత్వం లేని వారిని ఎవరూ రక్షించరు’ అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. కాగా, ఆ వార్డులోని ఒకరు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గుజరాత్ బీజేపీ ఉపాధ్యక్షుడు గోర్ధన్ జడాఫియా దీనిపై స్పందించారు. ఈ సంఘటనకు తమ పార్టీ ప్రమేయం లేదని తెలిపారు. ప్రజలను ఈ విధంగా బీజేపీలోకి చేర్చుకోమని ఎవరినీ ఆదేశించలేదని చెప్పారు. ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.