ఒక్క సీసీటీవీ వంద మంది పోలీసులతో సమానం… రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి.
-నిఘా నేత్రాల పైన అవగాహన కల్పిస్తున్న సిఐ,ఎస్ఐలు
-బాల్య వివాహలను ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు.
పెద్దేముల్ అక్టోబర్ 22(ప్రజాక్షేత్రం):ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పెద్దేముల్ మండల పరిధిలోని, నాగులపల్లి గ్రామంలో నిఘా నేత్రాల పైన (సీసీ కెమెరా) బాల్య వివాహాల పైన, సైబర్ నేరాల పైన, తదితర అంశాల పైన గ్రామ ప్రజలందరి సమక్షంలో, తాండూర్ రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి…పెద్దేముల్ ఎస్సై గిరి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… సమాజంలో నేరపవృత్తిని చేసేవారిని గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఎక్కడైతే ఎక్కువ నేరాలు జరుగుతాయో, అలాంటి ప్రదేశంలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తే, నేరాలు జరగకుండా అరికట్టవచ్చు, ఒకవేళ ఏదైనా నేరం జరిగిన కూడా వాటిని గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కాబట్టి, సమాజానికి ప్రయోజనం చేకూర్చే మంచి పనులకు మీ అందరి సహకారం ఉండాలని ఆయన సూచించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సీఐ
ఈ క్రమంలో సైబర్ నేరాల పట్ల కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వచ్చిన, ఇతర లింకులు వచ్చిన, వాటిని స్వీకరించవద్దు, తద్వారా మన ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం హరించబడతాయి.కాబట్టి సైబర్ నేరగాళ్ళు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారు అని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈమధ్య సైబర్ నేరగాల్లు.. మేము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము, మీకు ఓటిపి వస్తుంది, ఓటిపి నంబర్ చెప్పండి అని కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు సమాధానం ఇవ్వొద్దని ఆయన సూచించారు.ఒకవేళ మీకు ఎలాంటి అనుమానం కలిగిన 1930 నంబర్ కి కాల్ చేయండి.ఎలాంటి బ్యాలెన్స్ తో సంబంధం లేకుండానే, కాల్ కనెక్ట్ చేయబడుతుంది. తద్వారా పోలీసు వారు వెంటనే రిసీవ్ చేసుకుని.. నేరస్తులను పట్టుకునే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.
బాల్య వివాహాలు చేయటం నేరం.. ఎస్సై గిరి
ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, బాల్య వివాహాలు చేయరాదు. ఇంట్లో పరిస్థితుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, కుటుంబ సమస్యల వలనో లేదంటే ఆడపిల్లలను ఎక్కువ చదివిస్తే ఎక్కువ వరకట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందననే భయంతోనో, చాలామంది తల్లిదండ్రులు పెళ్లి వయసు రాకముందే పిల్లలకు వివాహాలు చేస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఆడపిల్లల పెళ్ళిలు చేసి, వారి యొక్క బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు అని ఆయన గుర్తు చేశారు. తక్కువ వయసులో వివాహం చేస్తే… ఆ వయసులో ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా కుటుంబ బాధ్యతలు స్వీకరించే శక్తి వాళ్లకు ఉండదు. ముఖ్యంగా వారి శరీర భాగాల ఎదుగుదల సరిగ్గ జరగదు. వారి దాంపత్య జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని ఆయన అభివర్ణించారు. తద్వారా అనేక దుష్ప్రభావాలకు దారితీసి, చివరకు వారి జీవితాలను చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా అవుతారు. కాబట్టి ఎవరైనా బాల్యవివాహాలు చేసిన, బాల్య వివాహలను ప్రోత్సహించిన సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తాము అని ఈ సందర్భంగా ఎస్సై గిరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గిరి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.