ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
-చేవెళ్ల సీఐ వెంకటేశం
శంకర్ పల్లి, అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేకుంటే వాటిని ఉల్లంఘించిన వారిపై జరిమానా తప్పదని ట్రాఫిక్ సీఐ వెంకటేశం తెలిపారు. శంకర్ పల్లి మండలం మోకిల ప్రధాన రహదారి పక్కన ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా బుధవారం పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవింగ్ చేస్తున్న వారు సీటు బెల్టు ధరించాలన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయరాదు, మద్యం సేవించి వాహనాలు నడప రాదని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. వాహనాలపై పెండింగ్ ఉన్న చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం, శ్రీనివాస్, రవి సిబ్బంది ఉన్నారు.