Praja Kshetram
క్రైమ్ న్యూస్

బిల్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే…

బిల్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే…

-రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘట్కేసర్ మున్సిపల్ ఏఈ, వర్క్ ఇన్ స్పెక్టర్ లు.

ఘట్ కేసర్, అక్టోబర్ 25(ప్రజాక్షేత్రం):వినాయక నిమజ్జనం సందర్భంగా క్రేన్ లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు చేసేందుకు రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఘట్ కేసర్ మున్సిపల్ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్ స్పెక్టర్ సున్నీ లను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ రంగారెడ్డి యూనిట్ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఘట్ కేసర్ మున్సిపల్ కాంట్రాక్టర్ శివరాత్రి కుమార్ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా టెండర్ లో పాల్గొని ఎదులాబాద్ లక్ష్మీ నారాయణ చెరువు వద్ద 3 క్రేన్ లను ఏర్పాటు చేశాడు. అందుకు సంబందించిన రూ.10 లక్షల బిల్లులు రావలసి ఉండగా బోడుప్పల్ కార్పోరేషన్ ఏఈ మంగురావు రాజశేఖర్ ప్రస్తుతం ఘట్ కేసర్ మున్సిపల్ ఇంచార్జి ఏఈ గా భాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్ స్పెక్టర్ గా మేడే సున్నీలు పలు కారణాలు చెప్తు జాప్యం చేస్తున్నారు. బిల్లు మంజూరు కావాలంటే రూ.1.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేది లేక ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు ఏఈ కి రూ.80 వేలు, వర్క్ ఇన్ స్పెక్టర్ కు రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం మద్యాహ్నం లంచం డబ్బులు యిచ్చేందుకు బోడుప్పల్ కార్పోరేషన్ కార్యాలయానికి వెళ్లగా ఆఫీసులో వద్దు ఇంటి వద్ద తీసుకుంటానని వెళ్లాడు. కాంట్రాక్టర్ కుమార్ ఏఈ రాజశేఖర్ కు అతని ఇంట్లో లంచం యిస్తుండగా ఏసీబీ రంగారెడ్డి యూనిట్ డీఎస్పీ ఆనంద్ కుమార్ సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని ఘట్ కేసర్ మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్ స్పెక్టర్ మేడె సున్నీ కి ఫోన్ ఫే ద్వారా రూ.30 వేలు పంపటంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది ఇంకేవరైనా ఉన్నారా అనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. లంచం తీసుకున్న ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

Related posts