Praja Kshetram
తెలంగాణ

మా టైం బాగాలేదు.. సర్దుకు పోతున్నాం : జగ్గారెడ్డి

మా టైం బాగాలేదు.. సర్దుకు పోతున్నాం : జగ్గారెడ్డి

 

హైదరాబాద్, అక్టోబర్ 25(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఇటీవల జగిత్యాలలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర కలత చెందారు. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన సాగుతున్నా.. జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ పాలన సాగుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానానికి సైతం లేఖ రాశారు. అలాంటి వేళ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి శుక్రవారం స్పందించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన మీడియాలో చూసిన తర్వాత తనకు చాలా బాధకలిగిందన్నారు. ఆయన విషయంలో ఏం జరుగుతుందో తనకు అర్ధం అవ్వడం లేదు.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని చెప్పారు. ఈ వయస్సులో జీవన్ రెడ్డికి.. ఇంతటి ఆవేదన ఏమిటని తన మనస్సు కలుక్కుమందన్నారు. జీవన్‌రెడ్డికి జగ్గారెడ్డి అండగా ఉన్నాడని చెప్పడానికి…తన మనసులో మాట మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాట్లు తెలిపారు. అయితే తాను ఎవరిని తప్పుపట్టడం లేదని పేర్కొన్నారు. కానీ తాను ఒంటరినని అనుకోవద్దని ఈ సందర్బంగా జీవన్ రెడ్డికి ఆయన సూచించారు. సమయం వచ్చినప్పుడు జీవన్‌రెడ్డి వెంట జగ్గారెడ్డి ఉంటాడని చెప్పారు. జీవన్ రెడ్డి పక్కా కాంగ్రెస్ వాది అని.. కానీ ఆయన జీవితమంతా కష్టాలేనని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఆయన నిత్యం ప్రజల మధ్య ఉంటారన్నారు. అలాంటి ఆయన్ని జగిత్యాల ప్రజలు ఎందుకు ఒడగొట్టారో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. అలాగే సంగారెడ్డిలో తాను ఎంతో అభివృద్ధి చేశానని.. అయినా తనను సైతం ఎందుకు ఓడగొట్టారో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. తాను పార్టీని కానీ.. ప్రజలను కానీ తప్పుపట్టడం లేదన్నారు. తమ టైం బాగోలేదని.. ఎవరేం చేస్తామని అందుకే సర్దుకు పోతున్నామని వివరించారు. ఇక ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి… తన వయస్సుకు తేడా ఉందన్నారు. ఈ వయసులో ఆయనకు ఇలాంటి రాజకీయ ఇబ్బందులు రావడం నిజంగా బాధాకరంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీని మీడియా ముఖంగా జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Related posts