బీరు సీసాలో బల్లి.. వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన
వికారాబాద్ అక్టోబర్ 25(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లాలో పార్టీ చేసుకుందామని పెద్ద ఎత్తున బీర్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బడ్‌వైజర్ బీరు తాగుదామని ఓపెన్ చేయబోయిన వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో షాకైన వ్యక్తి.. బాటిల్‌ను ఓపెన్ చేయకుండానే తీసుకెళ్లి తనకు మందు అమ్మిన వైన్ షాపు యజమాని ముందుంచాడు. కానీ తనకేమీ సంబంధం లేదని దబాయించడంతో సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య ఇద్దరూ పార్టీ చేసుకోవడానికి రూ.4వేల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు. మండల కేంద్రంలోని ఓ వైన్ షాపు నుంచి బీర్లతో పాటు వివిధ బ్రాండ్లకు చెందిన మందును తీసుకున్నారు. తీరా పార్టీ చేసుకుందామని బీరు బాటిల్ ఓపెన్ చేయబోతే అందులో ఏదో తేడాగా కనిపించింది. అదేంటని క్షుణ్నంగా పరిశీలించగా అతని దిమ్మతిరిగిపోయింది. బడ్‌వైజర్ బీరు బాటిల్లో చనిపోయిన బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాకైన వాళ్లు.. వెంటనే తమకు మందు అమ్మిన వైన్ షాపునకు వెళ్లారు. బీరు బాటిల్‌లో బల్లి ఉందని చూపిస్తే సదరు వైన్ షాపు యజమాని తమకేమీ సంబంధం లేదని దబాయించాడు. కంపెనీ నుంచే అలా వచ్చి ఉంటుంది.. మేమేం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో లక్ష్మీకాంత్ రెడ్డి బీర్ బాటిల్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.