Praja Kshetram
తెలంగాణ

బెదిరింపులు, సెటిల్‌మెంట్లు.. ఖాకీల లీలలు అన్నిన్ని కావయా !

బెదిరింపులు, సెటిల్‌మెంట్లు.. ఖాకీల లీలలు అన్నిన్ని కావయా !

-ఉన్నతాధికారుల నిఘా లోపంతో అక్రమాలు

-జోరుగా బెదిరింపులు, సెటిల్‌మెంట్లు

హైదరాబాద్‌ అక్టోబర్ 26(ప్రజాక్షేత్రం):నగర శివారులోని ఖరీదైన కమిషనరేట్‌లో కొంతమంది ఖాకీల లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పోలీస్‌ ఉన్నతాధికారుల నిఘా లోపంతోనే కొంతమంది ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు, క్షేత్రస్థాయి అధికారులు రెచ్చిపోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్‌ పరిధిలో అడ్మిన్‌ ఎస్సైలతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్న ఇన్‌స్పెక్టర్ల బాగోతాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో లోతుగా విశ్లేస్తున్న కొద్దీ మరికొంతమంది ఖాకీల గుట్టు బహిర్గతమవుతోంది.

ఏసీపీగా నేనే వస్తున్నా..

దేశంలోనే అతిపెద్ద కాలనీ పరిధిలో ఉన్న ఓ ఏసీపీ పోస్టింగ్‌ విషయం నెలరోజుల ముందే తెలిసింది. స్థానికంగా ఉండే కొంతమంది వ్యాపారులకు డోంట్‌ వర్రీ.. తానే ఏసీపీగా వస్తున్నానని చెప్పుకున్నట్లు తెలిసింది. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం జరిగిన బదిలీల్లో ఆయన ఏసీపీగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే తన కుటుంబంలో జరిగిన ఒక వేడుకకు సంబంధించిన కొన్ని పనులను ఉచితంగా చేయించుకున్నట్లు డివిజన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు ఏసీపీ కార్యాలయం సమీపంలోని ఎస్‌హెచ్‌వోతో కలిసి బిల్డర్‌కు అనుకూలంగా సెటిల్‌మెంట్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నాకు పోస్టింగ్‌ ఎలా వచ్చిందో తెలుసా ?

ఇక మాదాపూర్‌ జోన్‌ నుంచి పారిశ్రామికవాడలో పోస్టింగ్‌ పొందిన ఇన్‌స్పెక్టర్‌కు ఆవేశం ఎక్కువ. ఎవరైనా ఫిర్యాదుదారులకు స్టేషన్‌లో అన్యాయం జరిగినా.. లేక ఇన్‌స్పెక్టర్‌ కేసు తప్పుదోవ పట్టిస్తున్నట్లు గుర్తించి నిలదీసినా.. ‘అసలు నాకు పోస్టింగ్‌ ఎలా వచ్చిందో తెలుసా?’ అని రంకెలేస్తారని ఆరోపణలు వస్తున్నాయి.

సెక్టార్‌ ఎస్సైలూ.. తగ్గేదేలేదు

సెక్టార్‌ ఎస్సైలు సైతం అక్రమ దందాలో తగ్గేదేలేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రానికి చెందిన ఒక యజమాని బాలకార్మికుడితో పనిచేస్తున్నట్లు తెలిసింది. సెక్టార్‌ ఎస్సై సదరు యజమానిని స్టేషన్‌కు పిలిచి కేసు నమోదు చేస్తానని బెదిరించడంతోపాటు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

Related posts