వాళ్లు కాంగ్రెస్‌పై ప్రేమతో రాలేదు.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ అక్టోబర్ 26(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రావడం లేదని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్‌లో చేరుతున్నారని సంచలన వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటే వాళ్లకు విశ్వాసమే లేదని విమర్శించారు. జగిత్యాలలో తన అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్య అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఫోన్ చేసినా తన స్వరాన్ని తగ్గించలేదు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించేందుకు జగిత్యాల మధుయాష్కీ వెళ్లారు. జీవన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యపై మధుయాష్కీ జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసును లోతుగా దర్యాప్తు చేయకుండానే పాత కక్షల కారణంగానే హత్య చేశారని పోలీసులు చెప్పడం విచారకరమని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ముందుగానే పోలీసులకు చెప్పినప్పటికీ రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అనంతరం పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభద్రతభావంతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సి వచ్చిందని మధుయాష్కీ తెలిపారు. అలా వచ్చిన వాళ్లెవరూ కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి రాలేదని.. స్వలాభంతో పాటు తమ ఆస్తులను కాపాడుకునేందుకే వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.