Praja Kshetram
జాతీయం

ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు

 

చెన్నై, అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):తనను సినిమా ఆర్టిస్ట్ అంటూ కొందరు పేర్కొంటున్నారని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్‌ పేర్కొన్నారు. అయితే తమిళనాట ఎంజీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారని ఈ సందర్భంగా విజయ్ గుర్తు చేశారు. ఆదివారం విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మహానాడును విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహాసభకు లక్షలాది మంది ప్రజలు, విజయ్ అభిమానులు పోటెత్తారు. ఈ సందర్బంగా హీరో విజయ్ మాట్లాడుతూ.. పెరియార్‌ ఈవీ రామసామి, కె. కామరాజ్‌, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, వేలు నాచియార్‌, అంజలై అమ్మాళ్‌ వేసిన బాటలోనే తమిళగ వెట్రి కజగం (టీవీకే) పయనిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ప్రకటించారు.

సినిమాల్లో హీరోగా నటిస్తూ తాను అత్యున్నత శిఖరాల్లో అధిరోహించానన్నారు. అలాగే అత్యధిక పారితోషకం తీసుకుంటూ.. మీ అందరిని నమ్మి రాజకీయాల్లోకి వచ్చానని హీరో విజయ్ వెల్లడించారు. తన ఈ రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారని తెలిపారు. అయితే నీట్ సమస్య కారణంగా చనిపోయిన అరియలూరు విద్యార్థిని అనిత ఆత్మహత్యను ఈ సందర్భంగా హీరో విజయ్ గుర్తు చేసుకున్నారు.

ఈ ప్రసంగంలో భాగంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకేతోపాటు కేంద్రంలోని బీజేపీపై విజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ సభ ప్రారంభంలో హీరో విజయ్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. రాజకీయాల్లో మనం చిన్నపిల్లలమంటూ చాలా మంది వ్యాఖ్యానించారన్నారు. కానీ మనం ఆత్మవిశ్వాసంతో రాజకీయం అనే పాముతో ఆడుకునే పిల్లలమని అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఒక వేళ పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే వారికి ప్రభుత్వంలో భాగస్వామిని చేస్తామని టీవీకే అధినేత, హీరో విజయ్ స్పష్టం చేశారు.

Related posts