జనాభా గణనలోనే కులగణన చేపట్టాలి : ఆర్ కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ అక్టోబర్ 29 (ప్రజాక్షేత్రం):వచ్చే ఏడాది కేంద్రం జాతీయ స్థాయిలో చేపట్టనున్న జనాభా గణనలోనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరోనాతో నాలుగు సంవత్సరాలు ఆలస్యంగా జరిగిందన్నారు. కులగణన చేయాలని ఎన్‌డీఏ ప్రభుత్వంలోని భాగస్వామ్యపక్షాలైన జనతాదళ్, టీడీపీ, అప్పాదల్, రిపబ్లిక్ పార్టీ, జనశక్తి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సైతం కులగణన చేయాలని డిమాండ్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీలు, వామపక్షాలు, దేశంలోని ప్రజా సంఘాలు అన్ని కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. దేశంలోని అన్ని పార్టీలు, అన్ని కులాలు కులగణన చేయాలని డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అధిఆకరంలో ఉన్న కర్ణాటక, ఏపీ, తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాల్లో కులగణన చేపట్టారన్నారు. మండల కమిషన్‌తో సహా రాష్ట్రస్థాయి 265 బీసీ కమిషన్స్ సైతం కులగణనపై సిఫారసు చేశాయన్నారు. సుప్రీంకోర్టుతో పాటు దాదాపు 20 రాష్ట్రాల హైకోర్టులు కూడా కులగణన చేపట్టాలని తీర్పు చెప్పాయన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా కేంద్రం అంగీకరించకపోవడం సరికాదన్నారు. దేశంలో 75కోట్ల మంది బీసీల చిరకాల ఆకాంక్ష అన్నారు. కులగణనతో దేశంలో ఏయే కులం జనాభా ఎంత ఉంది? విద్యా ఉద్యోగాల్లో ప్రాతినిథ్యం ఎంత? వారి ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కుల గణన అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రైల్వే, ఎల్ఐసీ, బీహెచ్‌ఎల్, బ్యాంకింగ్, రక్షణసంస్థలను ప్రైవేటుపరం చేయొద్దని ప్రతిపక్షాలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్‌లోని 34 రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ విస్తృతంగా చర్చించాలని విజ్ఞప్తి చేశారు.