Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

నా పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికీ మంచిది కాదు: విజయమ్మ

నా పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికీ మంచిది కాదు: విజయమ్మ

 

అమరావతి, అక్టోబర్ 29(ప్రజాక్షేత్రం): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు వైఎస్ విజయమ్మ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదని విజయమ్మ అన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ… వైఎస్ బతికున్నప్పుడే ఆస్తులు పంచేశారన్నది అవాస్తవమన్నారు. జరగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తుందని, జరగకూడనివన్నీ నా కళ్లముందే జరిగిపోతున్నాయని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని, ఇక మీదట అబద్ధాల పరంపర కంటిన్యూ అవ్వకూడదని కోరారు. ఈ ఘటనలు తన పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికీ మంచిది కాదన్నారు. మీ ముందుకు ఇలా రావద్దనుకున్నా కానీ రావాల్సిన పరిస్థితి వచ్చిందని విజయమ్మ అన్నారు. దయచేసి తమ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని, మీ అందరికీ చేతులెత్తి మనవి చేసుకుంటున్నాను అని చెప్పారు. సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దని కోరారు. కొన్ని ఆస్తులు పాప పేరు మీద,కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారని కొందరూ మాట్లాడుతున్నారు. కానీ, అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. వైఎస్ఆర్ ఆస్తుల పంపకం చేయలేదు.. కొన్ని ఆస్తులు తన ఇద్దరు బిడ్డల పేర్ల మీద పెట్టారంతే అని విజయమ్మ వెల్లడించారు. ఆ సమయంలో విజయసాయి ఆడిటర్ గా ఉన్నారు. అన్ని అతనికి తెలుసాని, వైవీ సుబ్బారెడ్డి ఎంఓయూపై సాక్షి సంతకం చేశారని చెప్పారు. ఒక అమ్మగా తనకు ఇద్దరూ సమానమే అని, ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం అని వ్యాఖ్యానించారు. ఆస్తులను వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉంది, ఒక బాధ్యత గల కొడుకుగా తన కొడుకు కుటుంబ ఆస్తులను సంరక్షించారని విజయమ్మ హర్షం వ్యక్తం చేశారు. అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజమే, వైఎస్ఆర్ చివరి రోజుల్లో జగన్ ఆయనకు మాట ఇచ్చారని చెప్పారు.

Related posts