దళితుడు చనిపోయిన బెడ్‌ను భార్యతో కడిగించారు.. ప్రభుత్వ దవాఖానలో అమానుష
భోపాల్ నవంబర్ 03 (ప్రజాక్షేత్రం): బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని డిండోరీ జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. గాయపడిన రామ్‌రాజ్ మరవి (28) చికిత్స పొందిన పడకపై రక్తాన్ని ఆయన భార్య, ఐదు నెలల గర్భిణి అయిన రోషిణి చేత కడిగించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో విమర్శలు వస్తున్నాయి. రామ్‌రాజ్ కుటుంబ సభ్యులకు తమ సమీప బంధువులతో భూ వివాదం ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన దాడిలో రామ్‌రాజ్ ఇద్దరు అన్నయ్యలు, తండ్రి మరణించగా, రామ్‌రాజ్ గాయాలతో జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ఆయనకు చికిత్స చేసిన బెడ్‌పై రక్తాన్ని ఆయన భార్య చేత దవాఖాన సిబ్బంది కడిగించారు. ఆమెకు దవాఖాన సిబ్బంది నీళ్లు ఇస్తూ, ఆదేశాలు ఇవ్వడం కనిపించింది. దీనిపై వివా దం రేగడంతో ఓ వైద్యుడు వివరణ ఇచ్చారు. రోషిణి తన భర్త రక్త నమూనాలను తీసుకున్నారని చెప్పారు. బెడ్‌ను శుభ్రం చేయాలని ఆమెను ఎవరూ కోరలేదన్నారు.