నాలుగు రోజులకో జర్నలిస్టు హతం
-చాలా కేసుల్లో శిక్షలు పడని వైనం
-యునెస్కో నివేదిక స్పష్టం
హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజాక్షేత్రం):2022-23లో ప్రతి నాలుగు రోజులకు ఒక జర్నలిస్ట్ మరణించాడని, జర్నలిస్టుల హత్యలకు సంబంధించిన చాలా కేసుల్లో శిక్షలు పడటం లేదని యునెస్కో స్పష్టం చేసింది. యుఎన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) శనివారం నివేదిక విడుదల చేసింది. జర్నలిస్టుల మరణాలు 38 శాతం పెరిగాయని, వీటిని ఆపాలని ప్రభుత్వాలను కోరింది. జర్నలిస్టుల మరణాలు పెరుగుదల ”ఆందోళనకరం” అని నివేదికలో స్పష్టం చేసింది. ”సత్యాన్ని అనుసరించడం, వారి కీలకమైన పనిని చేస్తున్నందుకు 2022-23లో ప్రతి నాలుగు రోజులకు ఒక జర్నలిస్ట్ చంపబడ్డాడు” అని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే తెలిపారు. ఈ నేరాలు తగ్గేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆమె ప్రపంచ దేశాలను కోరారు. 2022-23లో సంఘర్షణలను కవర్ చేస్తూ మరణించిన వారిలో స్థానిక జర్నలిస్టులు 86 శాతం ఉన్నారని యునెస్కో నివేదిక పేర్కొంది. 2023లో పాలస్తీనాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని, 24 మంది జర్నలిస్టులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ మరణించారని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి గాజా, ఇజ్రాయిల్, లెబనాన్‌లలో మరణించిన జర్నలిస్టుల సంఖ్య 135 కంటే ఎక్కువగా పెరిగింది. గాజా, లెబనాన్‌లలో ఇజ్రాయిల్ యుద్ధాలను కవర్ చేస్తున్నప్పుడు జర్నలిస్టులు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఇజ్రాయిల్ అధికారులు గాజాలో అల్ జజీరా జర్నలిస్టులను పదేపదే చంపి బెదిరించారు. వీరిని హమాస్ అనుబంధ సంస్థలుగా వారు ఆరోపించారు. 2022-23లో చంపబడిన జర్నలిస్టులలో 14 మంది మహిళలు ఉన్నారు. కనీసం ఐదుగురు 15-24 మధ్య వయస్సులో ఉన్నవారే మరణించారు. ఈ మరణాలపై 2006 నుంచి యునెస్కో గుర్తించిన 85 శాతం కేసులు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. జర్నలిస్టులను రక్షించడానికి, ప్రపంచవ్యాప్తంగా మీడియా ఉద్యోగులపై నేరాలను పరిశోధించి, విచారించడానికి ప్రభుత్వాలు ”అత్యవసర చర్యలు తీసుకోవాలి” అని యుఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు.