మోదీ పేరు మాకు బోర్ కొట్టేసింది.
వయనాడ్ నవంబర్ 03 (ప్రజాక్షేత్రం):వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి, తన సోదరి ప్రియాంక గాంధీ తరఫున ఆదివారంనాడిక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ అంటే తమందరికీ బోర్ కొట్టిందన్నారు. ఆయన పేరు లేకుండా తన ప్రసంగం కొనసాగించాలని అనుకుంటున్నానని చెప్పారు. ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
”నా ప్రసంగాన్ని మోదీపై ఫోకస్ చేయకుండా ఓటర్లను తన కుటుంబ సభ్యులుగా సంబోధించి మాట్లాడటానికే ప్రాధాన్యత ఇవ్వదలచాను. నా సోదరి ఇప్పటికే మోదీ పేరు ఒకసారి ప్రస్తావించింది. రెండోసారి ఆయనను ప్రస్తావించడం ఎందుకు? ఆయనంటే మాకు బోర్ కొట్టేసింది” అని రాహుల్ అన్నారు. తాను ఇంతవరకూ ఇతరుల కోసం ప్రచారం చేస్తూ వచ్చానని, అయితే ప్రియాంక కోసం ప్రచారం చేయడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పారు.
*వయనాడ్‌కు బెస్ట్ ఎంపీ అవుతుంది*
ప్రియాంకను గెలిపిస్తే వయనాడ్‌కు ఉత్తమ ఎంపీ ఆమె అవుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచారని, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్, పర్యాటకం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలపై తగిన ప్రణాళికలపై దృష్టి సారించిందని చెప్పారు. ప్రియాంక వంటి చెల్లెలు ఉంటటం తన అదృష్టమని, ఇప్పుడు వయనాడ్ ప్రజలకు కూడా మంచి చెల్లెలు దొరకడం అదృష్టమని, ఆమె చెల్లిగా, తల్గిగా, కూతురుగా అండగా ఉంటారని, వయనాడ్‌కు ఉత్తమ ఎంపీగా నిలుస్తారని అన్నారు. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేరళ పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్, కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్, ఎమ్మెల్యే టి.సిద్ధిఖి తదితరులు పాల్గొన్నారు. యూపీలోన రాయబరేలి నియోజకవర్గాన్ని ఉంచుకుని వయనాడ్ సీటును రాహుల్ ఖాళీ చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక తొలిసారిగా వయనాడ్ ఉపఎన్నికల అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నవంబర్ 13న వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక జరుగనుంది.