Praja Kshetram
తెలంగాణ

తోపులాటలో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి

తోపులాటలో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి

 

యాదాద్రి, నవంబర్ 08(ప్రజాక్షేత్రం):మంత్రి కొండా సురేఖ తోపులాటలో ఇరుక్కుపోయారు. అవును.. మీరు విన్నది కరెక్టే. స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ యాదాద్రిలో ఏం జరిగింది.. మంత్రి కొండా సురేఖ తోపులాటలో ఎలా ఇరుక్కుపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం… యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన సందర్భంగా పెద్దఎత్తు ఆయన అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. సీఎంను చూసేందుకు ఎగబడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో తూర్పు గోపురం వద్ద పోలీసులు – కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ కూడా తూర్పుగోపురం వద్దకు వచ్చారు. అంతలోనే తోపులాట చోటు చేసుకోవడంతో మంత్రి కూడా అందులో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక తోపులోటలో కాసేపు మంత్రి విలవిలలాడి పోయారు. చివరకు ఎలాగోలా పోలీసులు.. మంత్రి కొండా సురేఖను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాటతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తానికి కార్యకర్తలను అదుపు చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.

Related posts