మరోసారి అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు.. హాస్పిటల్‌కు తరలింపు
మంచిర్యాల నవంబర్ 08 (ప్రజాక్షేత్రం):రాష్ట్రంలోని గురుకులాలు రోగాలకు నిలయంగా మారాయి. పాలన పడకేయడంతో విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన గురుకుల పాఠశాలలు విద్యార్థుల మృతితో స్మశానాలుగా మారుతున్నాయి. వసతుల లేమితో గురుకులాలకు వెళ్లాలంటేనే పిల్లలు జంకుతున్నారు. పలు గురుకులాల్లో విద్యార్థులు హాస్టల్ వదిలి ఇంటిబాట పడుతున్నారు. తాజాగా మంచిర్యాలలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి మరోసారి వాంతులు కాగా, మరో విద్యార్థినికి కడుపు నొప్పితో బాధపడింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. కాగా, జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 12 మంది విద్యార్థినులు కొద్ది రోజుల క్రితం ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే చికిత్స పొందుతున్న విద్యార్థులు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.