మణిపూర్‌లో గిరిజనుల ఇళ్లకు నిప్పు..మహిళ మృతి
హైదరాబాద్ నవంబర్ 08 (ప్రజాక్షేత్రం):మణిపూర్‌లో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. సాయుధులైన వ్యక్తులు చెలరేగిపోయారు. జిరిబామ్ జిల్లాలోని గిరిజన గ్రామమైన జైరోన్ హ్మార్‌పై గురువారం రాత్రి దాడులకు పాల్పడ్డారు. ఆరు ఇళ్లకు నిప్పుపెట్టారు. ఒక ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లల తల్లి మంటల్లో కాలి మరణించింది. భర్త, పిల్లల కళ్ల ముందే ఆమె చనిపోయింది. ఇళ్లు కాలిపోవడంతో పలువురు గిరిజనులు నిరాశ్రయులయ్యారు. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు కాలుతున్న ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. కాగా, మణిపూర్‌లో కొనసాగుతున్న సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కోసం మైతీ, కుకీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీలో చర్చలు జరిపారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. సెప్టెంబర్ 7న జిరిబామ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మణిపూర్‌లో గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 200 మందికిపైగా మరణించగా వేలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.