Praja Kshetram
జాతీయం

కలిసొచ్చే పార్టీలతో దోస్తీకి సిద్ధం

కలిసొచ్చే పార్టీలతో దోస్తీకి సిద్ధం

-టీవీకే అధ్యక్షుడు విజయ్‌

చెన్నై నవంబర్ 09 (ప్రజాక్షేత్రం): రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగనున్న ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో చేతులు కలిపేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత విజయ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అగ్రనటుడిగా రాణిస్తున్న విజయ్‌ ప్రారంభించిన టీవీకే తొలి మహానాడు ఇటీవల విల్లుపురం జిల్లా విక్రవాండిలో విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలను విజయ్‌ తీవ్రంగా విమర్శించారు. ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారు.. దానికి ఈ రెండు పార్టీల నేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో 2026లో రాష్ట్ర అసెంబ్లీకి జరుగబోయే ఎన్నికలకు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలకు 15 నెలల గడువున్నప్పటికీ, కూటమిపై దృష్టి సారించిన పార్టీలు ప్రజాదరణ పొందిన పార్టీలతో పొత్తు కుదుర్చుకొనే ప్రయత్నాల్లో దిగాయి. పార్టీ తొలి మహానాడులో ప్రసంగించిన విజయ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో దోస్తీ కడతానని వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అధికారంలో కూడా మిత్రపక్షాలకు భాగస్వామ్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో విజయ్‌తో పొత్తు కుదుర్చుకొనేందుకు కొన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీనిపై బహిరంగ ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, టీవీకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల నాయకత్వం కింద పనిచేసేందుకు ఇష్టపడదని, తమ సిద్ధాంతాలకు కట్టుబడి తమ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతోనే విజయ్‌ పొత్తు కుదుర్చుకుంటారని టీవీకే సీనియర్లు చెబుతున్నారు.

Related posts