Praja Kshetram
తెలంగాణ

మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కుటుంబ సర్వే

మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కుటుంబ సర్వే

-కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇబ్రహీంపట్నం, నవంబరు 10(ప్రజాక్షేత్రం):జిల్లాలో హౌస్‌ లిస్టింగ్‌ సర్వే దిగ్విజయంగా నిర్వహించామని, ఇదే ఉత్సాహంతో సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో జరుగుతున్న సర్వేను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5,376 ఎన్యుమరేషన్‌ బ్లాకులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రతీ బ్లాకులో ఎన్యుమరేటర్లను నియమించి సర్వే ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ఎన్యుమరేటర్ల కొరత ఏర్పడకుండా మరికొంత మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి అవసరమున్నచోటకు పంపిస్తామని తెలిపారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వే జరుగుతోందన్నారు. అధికారులు సర్వేకు వచ్చినప్పుడు కుటుంబ పెద్ద ఆధార్‌, రేషన్‌ కార్డులను చూపాలని సూచించారు. సమగ్ర సమాచారం సేకరించడం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం సులభమవుతుందన్నారు. సర్వే 15 రోజుల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత పది రోజుల్లో డేటా ఎంట్రీ ఉంటుందన్నారు. అంతకుముందు రెండు కుటుంబాల్లో జరుగుతున్న సర్వే తీరును పరిశీలించి ఎన్యుమరేటర్లకు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు సునీతారెడ్డి, ఎంపీడీవో వెంకటమ్మ ఉన్నారు.

Related posts