హైదరాబాద్‌లో భారీ పేలుడు… ఉలిక్కిపడిన ప్రజలు
హైదరాబాద్ నవంబర్ 10 (ప్రజాక్షేత్రం): హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం భారీ పేలుడు అలజడి సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు వన్‌లో ఈ పేలుడు సంభవించింది. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి సమీప బస్తీలోని రాళ్లు ఎగిరిపడ్డాయి. దీంతో బస్తీలోని ఇళ్లలో వంటసామాగ్రి చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో ఓ బాలికకు గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ పేలినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు ఏం జరుగుతోందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందారు. మరికొంతమంది భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు ధాటికి రెస్టారెంట్‌లోని అన్ని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.