లగచర్లలో 55 మందినిఅదపులోకి తీసుకున్న పోలీసులు.
-పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్!
-కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఉత్కంఠ
వికారాబాద్, ప్రతినిధి నవంబర్ 12 (ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం లగచర్లలో హైటెన్షన్ ఇంకా వీడలేదు. పోలీసుల నిర్బంధంలో గ్రామం నిర్మానుష్యంగా మారింది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థలసేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కలెక్టర్, అదనపు కలెక్టర్ త్రుటిలో తప్పించుకోగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను తప్పించేందుకు యత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా దాడి జరిగింది. జిల్లా కలెక్టర్, అధికారులను నమ్మించి దాడికి కుట్ర జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై ఈ ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అదేవిధంగా లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.