Praja Kshetram
జాతీయం

శ్మశానంలో కళ్లు తెరిచిన వృద్ధురాలు..

శ్మశానంలో కళ్లు తెరిచిన వృద్ధురాలు..

 

-భయంతో పరుగులు తీసిన బంధువులు

చెన్నై నవంబర్ 20 (ప్రజాక్షేత్రం):తిరుచ్చి జిల్లా వేల్‌కురిచ్చి వద్ద అరవైయేళ్ల బామ్మ మృతదేహానికి అంత్యక్రియలు జరుపుతుండగా ఉన్నట్టుండి ఆమె పైకి లేచి కళ్లు తెరవటంతో బంధువులంతా భయంతో పరుగులు తీశారు. తిరుచ్చి జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వేల్‌కురిచ్చిలో నివసిస్తున్న చిన్నమ్మాళ్‌ (60) వృద్ధాప్యంతో కంటి చూపు మందగించింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలలుగా ఆమె తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతూ మదురైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. అయినా చూపు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. కంటిలో నొప్పిని భరించలేకపోయింది. చివరకు ఆదివారం సాయంత్రం నొప్పి భరించలేక తోటలో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అపస్మారకస్థితికి చేరింది. దీంతో ఆమె కుమారుడు సుబ్రమణి చికిత్స నిమిత్తం ద్వారకురిచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యులు ఆమెకు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమంగా మారటంతో వైద్యులు ఇక ఆమె బ్రతకటం కష్టమని తేల్చి చెప్పారు. దీంతో చిన్నమ్మాళ్‌ కుమారుడు, కుటుంబ సభ్యులు, బంధువులంతా ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆమెను అంబులెన్స్‌లో తీసుకుని స్వస్థలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అంబులెన్స్‌ కుదుపులకు చిన్నమ్మాళ్‌కు పెట్టిన వెంటిలేటర్‌ కిందపడి ఆమె శ్వాస ఆగిపోయింది. దీనితో కుటుంబీకులంతా ఆమె మరణించినట్టు భావించి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్ళాలని నిర్ణయించారు. ఊరి ప్రజలకు, బంధువులకు చిన్నమ్మాళ్‌ అంత్యక్రియలు శ్మశానవాటికలో జరుగనున్నట్లు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ శ్మశానవాటిక వద్దకు చేరక ముందే ఊరి ప్రజలు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఖననం చేసేందుకు గోయి తవ్వుతుండగా కొంతమంది మహిళలు చిన్నమ్మాళ్‌పై పడి ఏడుస్తున్న సమయంలో ఉన్నట్టుండి చిన్నమ్మాళ్‌ కళ్లు తెరచి పైకి లేచింది. అది చూసి కుటుంబీకులు, బంధువులు, ఊరి ప్రజలు తలో దిక్కు పరుగులు తీశారు. పాడెపై నుండి లేచిన చిన్నమ్మాళ్‌ దాహంగా ఉందని, నీళ్లిమంటూ అడిగింది. కుటుంబ సభ్యులు ధైర్యం చేసుకుని చిన్నమ్మాళ్‌ దగ్గరగా వెళ్ళి చూసిన మీదట ఆమె ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు నీరు తాగించారు. వెంటనే అంబులెన్స్‌ను రప్పించి చిన్నమ్మాళ్‌ను మెరుగైనచికిత్స కోసం తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Related posts