లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. వాళ్లకు నోటీసులు
న్యూఢిల్లీ నవంబర్ 21(ప్రజాక్షేత్రం): లగచర్ల ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయ రంగు పులుముకోవడంతో అందరి ఫోకస్ ఈ గ్రామం మీదే మళ్లింది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పరస్పరం విమర్శలు చేసుకోవడంతో లగచర్ల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంచలనంగా మారిన ఈ ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. లగచర్ల గ్రామ ప్రజలపై వేధింపులు, హింస, తప్పుడు కేసుల దాఖలు ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ రియాక్ట్ అయింది. ఈ వ్యవహారంపై స్టేట్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ రెండు వారాల లోపు పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని నోటీసులు పంపించింది. ఈ విషయంలో తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపించాలని కూడా నిర్ణయించింది.
వాళ్లకు నోటీసులు
సరైన విధానాలు లేకుండా లగచర్లలో భూసేకరణ చేశారని.. దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు అక్కడి ప్రజల్ని వేధించి, తప్పుడు కేసులు నమోదు చేశారంటూ వచ్చిన కంప్లయింట్‌ను ఎన్హెచ్ఆర్సీ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. ఈ నివేదికలో ఎఫ్ఐఆర్ల స్థితితో పాటు కస్టడీలో ఉన్న వ్యక్తుల వివరాలు, భయంతో అడవుల్లో దాక్కున్న గ్రామస్తుల వివరాలు ఉండాలని కమిషన్ కోరింది. బాధిత మహిళలకు ఏదైనా వైద్య పరీక్షలు జరిగాయా? గాయపడిన గ్రామస్తులకు వైద్య సాయం అందించారా? అనే వివరాలు కూడా తెలియజేయాల్సిందిగా కోరింది.
నిజమని తేలితే..
మానవ హక్కుల కమిషన్‌కు అందిన ఫిర్యాదులో ఫార్మా ప్రాజెక్ట్ కోసం బలవంతంగా భూసేకరణ చేశారని తెలియజేసినట్లు సమాచారం. అదే రోజు సాయంత్రం వందలాది మంది పోలీసులు, కొందరు స్థానిక గూండాలు గ్రామం మీద దాడి చేశారని పేర్కొన్నారట. ఆ రోజు ఇంటర్నేట్ సేవలు నిలిపివేసి.. ఎవరితోనూ సంప్రదించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే గ్రామస్తులపై తప్పుడు ఫిర్యాదులతో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని.. కొందరు బాధితులు భయంతో ఇళ్లను వదిలి అడవుల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారట. ఒకవేళ కమిషన్ ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు నిజమైతే ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.