Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఎందుకీ మౌనం.. వైసీపీ వీరవిధేయుల్లో ఆవేదన..

ఎందుకీ మౌనం.. వైసీపీ వీరవిధేయుల్లో ఆవేదన..

 

తిరుపతి, నవంబరు 24 (ప్రజాక్షేత్రం):తమ నాయకుడికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పగ్గాలు వచ్చాయన్న ఆనందోత్సాహాలు కొద్ది రోజులకే వైసీపీ శ్రేణుల్లో ఆవిరైపోతున్నాయి. కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు చూడడంతో ముఖ్యనాయకులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు విజయవాడకు వెళ్లడం, జిల్లా ఇన్‌చార్జి మంత్రితో చర్చించడం వంటి పరిణామాలు వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి కుడిభుజంగా వ్యవహరించిన దొద్దారెడ్డి సిద్దారెడ్డితో పాటు అతడి వర్గీయులు, భూమన ఫొటోను బంగారు ఉంగరాలు, లాకెట్లో వేసుకు తిరిగిన డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపించడంతో వైసీపీ వర్గాల్లో నిస్తేజం ఆవహించింది.ఉమ్మడి జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భూమన ఆయా నియోజకవర్గాల సమావేశాల్లో బిజీగా ఉంటున్నారు. ఆయన తనయుడు మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ కొన్ని రోజులుగా తిరుపతిలో కనిపించడంలేదు. అవిశ్వాసంపై ఏమి జరిగినా స్వాగతిస్తామన్నట్టుగా మేయర్ శిరీష ఉండడంతో వైసీపీ సీనియర్ కార్పొరేటర్లు ఆవేదనతో రగిలిపో తున్నారు. ఈ నేపథ్యంలో ‘తిరుపతి రాజకీయం రివర్స్ అయిపోయింది. కాపాడుకోవాల్సిన వాళ్లు సైలెంట్ అయిపోయారు. కాపాడాల్సిన వారు కూడా మౌనం దాల్చారు’ అంటూ భూమన ముఖ్య అనుచరుడు, కార్పొరేటర్ ఎస్కే బాబు తన ఆవేదనను శుక్రవారం సాయంత్రం ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఇది గమనించిన భూమన సాహితీ మిత్రుడొకరు.. ‘ఏంది బాబూ ఇది?’ అంటూ ఇంటిపోరును వీధిలో వేసుకుంటామా? అన్నట్టుగా అసంతృప్తితో కామెంట్ చేశారు. దీంతో కొద్దిసేపటికి ఫేస్‌బుక్ నుంచి తన పోస్టు ఎస్కే బాబు తొలగించారు. అప్పటికే రాజకీయ వర్గాల్లో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. చేజారిపోతున్న కార్పొరేటర్లను బుజ్జగించి కాపాడుకోవాల్సిన మేయర్ చేతులెత్తేయడం, తమకే బలముందని కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేయాల్సిన భూమన పట్టించుకోకపోవడం వైసీపీలో చర్చగా మారుతోంది.

Related posts