కేసీఆర్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి..? మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
హైదరాబాద్ నవంబర్ 24(ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అందులోనూ రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కూమార్ గౌడ్ పెద్ద బాంబే పేల్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో బిఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైందంట. మొన్నటి వరకు అనర్హతవేటు భయంతో ఆగిపోయిన ఎమ్మెల్యేలు ఇక కారు దిగేస్తారని గులాబీ నేతలు కలవరపడుతున్నారంట. కేటీఆర్‌తో సన్నిహితంగా ఉండే వాళ్లే వెళ్లిపోతే ఇక పార్టీలో మిగిలేదవరన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతుంది. ఇంతకీ కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే లెవరు? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని న్యాయపోరాటానికి దిగిన బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది . కాంగ్రెస్‌లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు కోర్టు కెక్కారు .. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. అనర్హతపై స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసేంది.స్పీకర్ కు ఎలాంటి టైం బాండ్ లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేయడంతో.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు మళ్లీ వలసలపర్వానికి తెర లెగుస్తుందన్న టెన్షన్ గులాబీ నేతల్లో మొదలైందంట. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్‌కు టైం బాండ్ విధించలేమంటూ డివిజన్ బెంజ్ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కంటోన్మెంట్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగు సీటు కాపాడుకోలేక పోయింది. కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గిపోయింది. ఇప్పటి వరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 73కు చేరుకుంది. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడానికి క్యూలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఆ క్రమంలో హైకోర్టు తీర్పు తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలతో గులాబీ శిబిరంలో పెద్ద బాంబే పేలిందంట. బీఆర్ఎస్ పార్టికి ఎమ్మెల్యేలు, అందులోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ తిరిగే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. మహేష్ గౌడ్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎవరా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలని పొలిటికల్ సర్కిల్లో ఎవరికి వారు ఆరాలు తీస్తున్నారంట. అయితే గ్రేటర్ హైదరాబాద్ నుంచి గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే హస్తం గూటికి వెళ్తారన్న టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. జి హెచ్ ఎం సి ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం గూటికి వస్తారని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. అలాగే మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిల పొలిటికల్ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అదలా ఉంటే కేటీఆర్ కు ఈ మధ్య కాలంలో అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సన్నిహితంగా ఉంటున్నారు. వారిలో కౌశిక్‌రెడ్డి వస్తానన్నా కాంగ్రెస్‌లో చేర్చుకునే పరిస్థితి లేదంటున్నారు. ఆ క్రమంలో మమేష్‌గౌడ్ చెప్పిన.. ఆ ముగ్గురూ.. ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. హస్తం గూటికి వస్తే మంత్రి వర్గంలో చోటు కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారంట. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి వర్గంలో చోటు లేదని కాంగ్రెస్ ఇఫ్పటికే తేల్చి చెప్పింది. డిసెంబర్ 7 తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈలోపే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మహేష్ కూమార్ గౌడ్ చెప్తున్నారు. పార్టీలో కేసీఆర్, కేటీఆర్ వైఖరితోనే పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలు సిద్దం మవుతున్నారని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమవుతుండటంతో పెత్తనం చేస్తున్న కేటీఆర్ వైఖరి సీనియర్స్ కు తలనొప్పిగా మారిందంట. కేటీఆర్ కొందరిని మాత్రమే కలుపుకొని పోతున్నారని పార్టీలో చర్చ నడుస్తుంది. పార్టీకి నష్టం కలిగించే వారిని కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారంట. కేటీఆర్ వైఖరి అలాగే కొనసాగితే రానున్న రోజుల్లో హస్తం గూటికి మరికొందరు ఎమ్మెల్యేలు చేరడం ఖాయమని బీఆర్ఎస్ వర్గాలే అంటుండట గమనార్హం.