Praja Kshetram
సినిమా న్యూస్

కమెడియన్ ఆలీకి నోటీసులు.. రిప్లై ఎలా ఉంటుందో?

కమెడియన్ ఆలీకి నోటీసులు.. రిప్లై ఎలా ఉంటుందో?

 

నవాబ్ పేట నవంబర్ 24 (ప్రజాక్షేత్రం):అక్రమంగా ఏదైనా నిర్మాణం సాగిస్తున్నారా.. అయితే మీకు నోటీసులు వస్తాయి సుమా. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు పూర్తి దృష్టి సారించారు. ఇప్పటికే హైడ్రా ధాటికి ఆక్రమణదారుల గుండెలు ఘుభేల్ మంటుంటే, మరో వైపు పంచాయతీ అధికారులు కూడా ఎక్కడ అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే అక్కడ వాలిపోతున్నారట. అందుకే హైదరాబాద్ నగరంలో ఏదైనా స్థలం కొనుగోలు చేయాలన్నా, గృహాలు చేయాలన్నా అసలు అన్నీ ధృవీకరణ పత్రాలు ఉన్నాయా లేవా అంటూ కొనుగోలు దారులు ఆరా తీస్తున్నారట. అయితే తాజాగా పంచాయతీ అధికారులు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే సంబంధిత అధికారులు పూర్తి దృష్టి సారించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి నోటీసులు సైతం జారీ చేస్తున్నారు వారు. ఆ నోటీసుల పర్వం ప్రస్తుతం టాలీవుడ్ కమెడియన్ ఆలీ వరకు చేరింది. అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శి శోభారాణి తాజాగా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. వికారాబాద్ నవాబ్ పేట లోని ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 345 లో ఆలీ తండ్రి భాషా పేరు మీద ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ లో ఎటువంటి అనుమతులు లేకుండా ఆలీ అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారట. గ్రామపంచాయతీ కార్యదర్శి శోభారాణి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తించి ఈనెల 5వ తేదీన నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులకు ఎటువంటి రిప్లై లేకపోవడంతో మరో నోటీసును కూడా జారీ చేశారు. రెండవ నోటీసులో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయో, అందుకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను తీసుకుని గ్రామపంచాయతీ కార్యాలయంను సంప్రదించాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. కాగా రెండు దఫాలుగా నోటీసులు అందుకున్న ఆలీ, ఈ విషయంపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అసలు అక్రమంగా నిర్మాణాలు సాగుతున్నాయన్న విషయం ఏమో కానీ ఆలీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related posts