పోక్సో కేసులో నిందితులకు జైలు, జరిమానా
-బాధితురాలికి నష్టపరిహారం
రంగారెడ్డి కోర్టులు, నవంబరు 25(ప్రజాక్షేత్రం): ప్రేమ పేరుతో ఓ బాలికను వేధించి అసభ్యంగా ప్రవర్తించి, లైంగికదాడికి పాల్పడిన నిందితుడు మహ్మద్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. దీంతో పాటు బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి తీర్పు చెప్పారు. పీపీ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు మహ్మద్ ఓ బాలికను ప్రేమ పేరుతో లైంగికదాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. సాక్ష్యులను విచారించిన నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానతో పాటు బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.
మరో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
ఓ బాలికపై దాడికి యత్నించిన నిందితుడికి జైలు, జరిమానాతో పాటు బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరీశ్ తీర్పు చెప్పారు. పీపీ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరికప్పల మహేశ్ అనే యువకుడు ఓ బాలికను మభ్యపెట్టి లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలతో సహా కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. సాక్షులను విచారించిన న్యాయమూర్తి హరీశ్ నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.