వేనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. లగచర్ల భూ సేకరణ రద్దు
హైదరాబాద్ నవంబర్ 29(ప్రజాక్షేత్రం): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూ సేకరణ రద్దు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా లగచర్లలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి అవసరం. ఆ భూమిని సేకరించేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామాల్లో భూసేకరణపై ప్రజాభిప్రాయం సేకరించింది. ఆయా గ్రామాల నుంచి భూసేకరణపై వ్యతిరేకత ఎదురైంది. ఇటీవల వామపక్ష పార్లీలు లగచర్లలో పర్యటించి వాస్తవ పరిస్థితులు గుర్తించి, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వీటన్నింటి దృష్ట్యా లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. భూ సేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరించుకున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో అభిప్రాయ సేకరణ తర్వాత భూసేకరణ ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. భూ సేకరణలో ఆయా గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రజా ప్రయోజనాల నిమిత్తం భూసేకరణ ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ తెలిపింది.