Praja Kshetram
తెలంగాణ

కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ కల సాకారం – మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ కల సాకారం

 

-రాష్ట్రం ఉన్నంతకాలం ఆయన ఉంటారు

-రాజకీయ చతురతతో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు

-బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు

-మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

-శంషాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్

-భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 28 (ప్రజాక్షేత్రం):కేసీఆర్‌ దీక్ష వల్లే తెలంగాణ కల సాకారమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శుక్రవారం శంషాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన దీక్షా దివస్‌ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్‌ పేరు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్‌ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేశారని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వంలో హోంమంత్రి స్థాయిలో ఉండి దీక్ష విరమించాలని కేసీఆర్‌ను నేను కోరినా వినలేదన్నారు. ‘‘లేదమ్మా.. తెలంగాణ ఇస్తే దీక్ష విరమిస్తా.. లేదంటే నా ప్రాణాలు పోయిన పర్వాలేదని’’ చెప్పినట్లు గుర్తు చేశారు. మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వ అధ్వాన పాలనతో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ విలువ తెలిసి వచ్చిందన్నారు. నవంబరు 29 కేసీఆర్‌ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ రాజేంద్రనగర్‌ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ… 69 ఏళ్ల నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినా రానిది.. కేసీఆర్‌ చేసిన దీక్షతో సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ గురించి ముందుతరం తెలుసుకోవాలని సూచించారు. షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ… రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ కారణంగా రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్‌ పతనం ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీశ్‌, కోనమోళ్ల శ్రీనివాస్‌, మంచర్ల మోహన్‌రావు, సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

Related posts