రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి చంద్రబాబు భరోసా
-నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
-వచ్చే నెలలో కొత్తవి మంజూరు
-చేర్పులు, మార్పులకు అవకాశం
-అన్ని పథకాలకూ అదే ప్రామాణికం
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 1 (ప్రజాక్షేత్రం):అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గత వైసీపీ పాలనలో రేషన్‌కార్డులు లేక జిల్లావ్యాప్తంగా వేలాదిమంది పేదలు పథకాలకు దూరమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి విసిగి పోయారు. వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త రేషన్ కార్డుల కోసం సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. వచ్చే నెలలో అర్హులకు వాటిని మంజూరు చేయనుంది.
ఐదేళ్లుగా పథకాలకు దూరం
వైసీపీ ఐదేళ్ల పాలనలో రేషన్ కార్డులు లేక పేదలు, వృద్ధులు, వితంతువులకు సామాజిక ఫించన్లతోపాటు ప్రభుత్వ పథకాలను పొందలేకపోయారు. ప్రతి దానికీ రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఉచితంగా అందించే వైద్యసేవలను కూడా పొందలేకపోయారు. ఇంకోవైపు రేషన్ కార్డుల్లో తప్పుగా నమోదైన పేర్లను మార్చేందుకు కూడా గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారిలో ఆశలు చిగురించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది.
ఇప్పటికే 20వేల మంది దరఖాస్తు
జిల్లాలో 1,392 రేషన్‌షాపులు ఉండగా వాటి పరిఽధిలో సుమారు 6.68లక్షల కార్డులు ఉన్నాయి. కొత్త వి కోరుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 20వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం వచ్చినవి మరో ఏడెనిమిది వేల వరకూ ఉన్నాయి. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం అటు ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చడంతోపాటు కొత్త కార్డుల జారీకి నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి సచివాలయాల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. నూతన సంవత్సరంలో అర్హులందరికీ కార్డులు జారీ చేయనున్నారు.