Praja Kshetram
తెలంగాణ

అరణ్యవాసమా.. అస్త్ర సన్యాసమా? పాపం కేటీఆర్..!

అరణ్యవాసమా.. అస్త్ర సన్యాసమా? పాపం కేటీఆర్..!

 

హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజాక్షేత్రం):కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్‌గా రాజకీయాలంటే వైరాగ్యం వచ్చింది. కొంతకాలం పాలిటిక్స్‌ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫాం హౌస్‌కు పరిమితమైతే..ఇప్పుడు కేటీఆర్ రాజకీయాలకు విరామం ప్రకటడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అంత సడన్‌గా బ్రేక్ తీసుకోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతుంది.. అసలు ఆయన వైరాగ్యానికి కారణమేంటి? రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయాన్ని ఆయనే ఎక్స్ వేదికగా ప్రకటించారు. వెల్‌నెస్ రిట్రీట్ కోసం కొన్ని రోజులు వెళ్తున్నానంటూ స్పష్టంచేశారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులు తనను.. ఎక్కువగా మిస్ కారనే అనుకుంటున్నానంటూ చెణుకులు కూడా విసిరారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్‌కు పరిమితమైతే.. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలన్నీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులే చక్కబెడుతున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబరు టూగా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీలోని భజనపరులు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చిన హరీష్‌రావు.. ఇప్పుడు పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారు. వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్‌కి చెక్ పెట్టడానికి చూస్తున్నారంట. దాంతో అలెర్ట్ అయిన కేటీఆర్ తానే నెంబర్ టూ అనిపించుకోవడానికి హడావుడి మొదలు పెట్టినట్లు కనిపించారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తిరిగి పోరుబాట పట్టలేరని. ప్రస్తుతుమున్న పరిస్థితుల్లో వయస్సు, ఆరోగ్యం కూడా కేసీఆర్‌కు సహకరించవన్న సంగతి హరీష్‌రావుకి తెలియని సంగతి కాదంటున్నారు. అటు కేటీఆర్‌ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు. హరీష్ స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ అయిదేళ్లు అటు క్యాడర్ ఇటు ప్రజలలో తన ఇమేజ్‌ మరింతపెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అది గమనించారో ఏమో కేటీఆర్ అలెర్ట్ అయ్యే ప్రయత్నాలు చేశారు. ఈ మధ్య ఆయన బయటకు వస్తే భజనపరులు సీఎం, సీఎం అంటూ స్లోగన్స్‌తో హోరెత్తిస్తున్నారు. అదంతా అరెంజ్డ్ డ్రామానే అని ఫ్యూచర్‌లో పార్టీకి తానే దిక్కని చెప్పుకోవడానికి కేటీఆరే ఆ మెలో డ్రామా నడిపిస్తున్నారన్న వాదన వినిపించింది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ ఏంటో ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు. మరిలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం ఆశలపై సెటైర్లు వినిపిస్తున్న తరుణంలో ఆయన సడన్‌గా రాజకీయాలపైనే విరక్తి ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ అలిగారని అందుకే అందుకే పార్టీకి సెలవు పెట్టారంటున్నారు. సభలు, సమావేశాల్లో సీఎం సీఎం అంటూ ఫ్యూచర్ లీడర్ తానే అంటూ అనుచరులతో నినాదాలు చేయించుకుంటున్నారు కేటీఆర్.. తాజాగా పార్టీ ఆఫీసుకి వచ్చినప్పుడు కూడా పెద్దపెద్ద గజమాలలతో హడావుడి చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. వచ్చే వారమంతా సంబరాలు జరగనున్నాయి. వాటిపై కౌంటర్ ఇవ్వాల్సిన టైమ్‌లో కేటీఆర్ అస్త్ర సన్యాసం చేశారు. ఆయన సడన్‌గా పొలిటికల్ బ్రేక్ తీసుకోవడం వెనుకపెద్దకారణమే ఉందంటున్నారు. ఒకవైపు బావ హరీష్‌రావుతో పార్టీలో ఆధిపత్యపోరుతో సతమతమవుతుంటే.. చెల్లెలు ఎమ్మెల్సీ కవిత కూడా పొలిటికల్‌గా రీ యాక్టివ్ అవుతుండటం కేటీఆర్‌కు నచ్చడం లేదంట. గత పది రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీమ్‌ని గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్‌ కేసులోలో జైలు జీవితం గడిపి బెయిల్ వచ్చాక రెండు నెలల పాటు ఇంటికే పరిమితమైన కవిత. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పాలిటిక్స్‌లో కనిపించరనుకుంటున్న టైంలో సడన్‌గా యాక్టివ్ అయ్యారు. కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారంట. కవిత మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదంటూ పంతం పట్టిన కేటీఆర్ .. అదే విషయమై తండ్రి కేసీఆర్ తోనూ గొడవ పడ్డారంట .. అయతే కేటీఆర్ మాటలను కేసీఆర్‌ పట్టించుకోలేదంటున్నారు. మరోవైపు అన్న మాటలను కవిత కూడా లెక్కచేయడం లేదంట. అలా ఫ్యామిలీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగిన కేటీఆర్‌కు సడన్‌గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తుకొచ్చిందంటున్నారు. తన మాట చెల్లనప్పుడు కేటీఆర్ అలగడం మామూలే అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.. ఎన్నికల ముందు కూడా తాను కోరిన వారికి టికెట్లు ఇవ్వనందుకు అలిగి యూఎస్ వెళ్లిన విషయం గుర్తు చేస్తున్నారు. ఇక ఎన్నికల తర్వాత కేటీఆర్‌ను గ్రేటర్ పార్టీకి పరిమితమవ్వమని, జిల్లాల్లో బీఆర్ఎస్ బాధ్యతలు హరీష్ రావు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారంట. అప్పుడు కూడా కేటీఆర్ అలిగి తండ్రి ఫాం హౌస్ నుంచి వెళ్లిపోయారంట. చెల్లి విషయంలో కేటీఆర్ అలకేంటో కాని.. లగచర్లలో మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో ఆయన ఎలా వెళ్లిపోతారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. కొన్ని రోజుల పాటు ఎవరికీ అందుబాటులో ఉండననే మీనింగ్ వచ్చేలా కేటీఆర్ పెట్టిన ట్వీట్‌పై టీఆర్ఎస్ భవన్లో పెద్ద చర్చే జరుగుతుందిప్పుడు. వెల్‌నెస్ ట్రీట్‌మెంట్‌కి వెళ్తే రాజకీయాలల్లో బ్రేక్ తీసుకోవడమేంటని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ఎప్పుడూ సైలెంట్‌గా అలిగే కేటీఆర్.. ఇప్పుడు ట్వీట్ పెట్టి మరీ తన రిటైర్‌మెంట్ ప్రకటించి గులాబీ శ్రేణులకు మంచి షాకే ఇచ్చారు.

Related posts