మాలలు అంబేడ్కర్ ను అవమానిస్తున్నారు! సింహ గర్జనపై మందకృష్ణ ఫైర్..
హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజాక్షేత్రం):డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ పోరాట స్పూర్తిని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎమ్మార్పీఎస్ చీఫ్ మంద కృష్ణ మాదిగ అన్నారు. మాలల సింహగర్జన కార్యక్రమంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్ తన జీవిత కాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని వివరించారు. అయితే ఆయన లేని సమయంలో ఆయన స్పూర్తిని కొనసాగించాల్సిన దళిత వర్గాలు.. ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా.. సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక న్యాయ పోరాటానికి అడ్డు తగిలేవారే మనువాదులు అని నాడు అంబేడ్కర్ పోల్చారని గుర్తుకు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్ధపరులు అని విమర్శించారు. స్వార్థపరులే మనువాదులు అని మండిపడ్డారు. స్వార్థపరులైన మాలలు అంబేడ్కర్ వారసులు కాదని, అంబేడ్కర్ను అవమానిస్తున్నారని ఆరోపించారు. మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగిందన్నారు. దళితుల్లో ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను హరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు వారు అంబేడ్కర్ వ్యతిరేకులేనని అన్నారు. వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగిలే శక్తి ఉంటే.. కాంగ్రెస్ కు రాజీనామా చేసి వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.