నకిలీ పత్రాలతో కల్యాణలక్ష్మి
వైరాలో నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి సొమ్మును కాజేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. వైరా ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి గుగులోతు రాము, సహాయకుడు భరత్ అప్రమత్తతో ఈ నకిలీ బాగోతం వెలుగుచూసింది.
వైరా డిసెంబర్ 11(ప్రజాక్షేత్రం): వైరాలో నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి సొమ్మును కాజేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. వైరా ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి గుగులోతు రాము, సహాయకుడు భరత్ అప్రమత్తతో ఈ నకిలీ బాగోతం వెలుగుచూసింది. కొణిజర్ల మండలంలోని అంజనా పురానికి చెందిన ఒక యువకుడు నకిలీ పత్రాలు సృష్టించి వైరా కి సంబంధం లేని దంపతులను తెర మీదకు తీసుకువచ్చి కల్యాణలక్ష్మి సొమ్మును కాజేసేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సదరు యువకుడు గతంలో మీసేవ కేంద్రాన్ని నడిపిన సమయంలో అనేక నకిలీ పత్రాలతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సొమ్ముతో పాటు అసంఘటిత కార్మికుల పింఛన్ల సొమ్మును భారీగా కాజేసినట్టు చర్చ నడుస్తోంది. దిశ సేకరించిన వివరాల ప్రకారం.. వైరా మున్సిపాలిటీ 14వ వార్డులోని ఇస్లావత్ కిషోర్ కుమార్తె ఇస్లావత్ రోహిణికి పెనుబల్లి మండలం అడవిమల్లెల(లంక సాగర్)కు చెందిన మూడు సోమ్లానాయక్‌తో ఈ ఏడాది మార్చి 30న వరుడి ఇంటి వద్ద రాత్రి 7 గంటలకు వివాహం జరిగినట్లు వధూవరులకు సంబంధించిన పెళ్లి ఆహ్వాన పత్రికలు ముద్రించారు. అయితే ఈ ఏడాది నవంబర్ 11న మీ సేవలో కల్యాణలక్ష్మి కోసం వైరా రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు జత చేసినవన్నీ నకిలీ ధ్రువపత్రాలు వెలుగుచూసింది.
నకిలీ పత్రాల బాగోతం బహిర్గతమైందిలా..
వైరా మున్సిపాలిటీ 14వ వార్డులోని లంబాడి తండాలో నివాసముంటున్నట్లు నకిలీ ఆధార్ కార్డు తయారు చేసి, ఇస్లావత్ రోహిణి కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేశారు. ఆమెకు వైరాతో ఎలాంటి సంబంధం లేదు. 14వ వార్డులోని ఇంటి నెంబర్ 7-231/బి లో నివాసముంటున్నట్లు నకిలీ ఆధార్ కార్డును సృష్టించారు. అయితే ఆ వార్డులో 7-231 గల ఇల్లు మాత్రమే ఉన్నట్లు మున్సిపాలిటీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అలాగే కల్యాణ లక్ష్మికి దరఖాస్తు తో పాటు జత చేసిన రేషన్ కార్డు కూడా నకిలీ దేనని రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. వైరా ప్రభుత్వ హైస్కూల్లో 2021లో రోహిణి 10వ తరగతి పాసైనట్లు, ఆమె ఇక్కడే చదివినట్లు ఉన్న నకిలీ మెమో, టీసీని కూడా దరఖాస్తుకు జత చేశారు. పదోతరగతి మెమో, టీసీ మీద ఉన్న అడ్మిషన్ నెంబర్ 1875 దుగ్గిరాల వంశీకి చెందినదని ప్రభుత్వ హైస్కూల్ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అలాగే ఈ ఏడాది అక్టోబరు 4న వైరా సబ్జెజిస్ట్రార్ కార్యాలయంలో సోమ్లానాయక్, రోహిణి వివాహ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు దరఖాస్తుకు నకిలీ ధ్రువపత్రాన్ని జతచేశారు. పెళ్లి ఫొటోతో పాటు ఈ ఏడాది నవంబర్ 11న వైరా డీసీసీబీ బ్రాంచ్‌లో రోహిణి తల్లి తెరిచిన బ్యాంకు ఖాతా పుస్తకాన్ని కూడా దరఖాస్తుకు జతచేశారు. మధిర కు చెందిన అసిస్టెంట్ సివిల్ డాక్టర్ గెజిటెడ్ అధికారి సంతకం తో తయారు చేసిన నకిలీ ధ్రువపత్రాన్ని, అలాగే వైరా మునిసిపాలిటీలోని చైర్మన్ తర్వాత స్థానంలోని ఒకరి సంతకంతో ఉన్న తొలి వివాహ నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని, గ్రామ పెద్దలు ఐదుగురు సాక్షులుగా ఉన్నట్లు పేర్కొన్న ఒక ధ్రువపత్రాన్ని దీనికి జతచేశారు. చివరికి రెవెన్యూ కార్యాలయంలో ఈ ఏడాది నవంబర్ 11న రూ.1.90లక్షలకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకున్నట్లు ఒక నకిలీ ధ్రువపత్రాన్ని సృష్టించి జతచేశారు. మొత్తంగా బ్యాంకు ఖాతా మినహా మిగిలినవన్నీ నకిలీ ధ్రువపత్రాలు గా భావిస్తున్నారు.
రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు..
వైరా గిర్దావర్ మొదలుకొని తహసీల్దార్ వరకు ఈ నకిలీ ధ్రువపత్రాలను నిజమైనవిగా భావించి కల్యాణలక్ష్మి మంజూరుకు సిఫార్సు చేశారు. సోమవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కార్యాలయానికి సిఫార్సు చేసిన జాబితా వచ్చింది. ఆసమయంలో కార్యాలయ ఇన్‌చార్జిగా ఉన్న గుగులోతు రాము ఈ నకిలీ లీలలను కనిపెట్టారు. 14వ వార్డులోని తమ ఇంటి పక్కనే ఇస్లావత్ రోహిణి ఉన్నట్లు ఆధార్ కార్డు బయటపడటంతో నకిలీ బాగోతం వెలుగుచూసింది. ఆ దరఖాస్తుకు సంబంధించిన ధ్రువ పత్రాలను పరిశీలించగా అవి నకిలీవిగా గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో చివరకు రెవెన్యూ అధికారులు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసి, తమను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.