చైర్మన్ తీరుపై మల్లికార్జున ఖర్గే విమర్శ
ఢిల్లీ డిసెంబర్ 11(ప్రజాక్షేత్రం): రాజ్య సభలో పెద్ద నిర్ణయం చైర్మన్ దే అని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్య సభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి గల కారణాలను ఈన రోజు మల్లికార్జున ఖర్గే మీడియాకు వివరించారు. పెద్దల సభలో ఏర్పడుతోన్న అంతరాయాలకు అతిపెద్ద కారణం చైర్మన్ ధన్కడేనని.. సభలో ఆయన స్కూల్ హెడ్ మాస్టర్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సభలో బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తూ.. విపక్షాలకు చెందిన సీనియర్ ఎంపీలను దూషిస్తున్నారని మండిపడ్డారు. ఛైర్మన్‌పై తమకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మరో మార్గం లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 1952 నుండి ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఏదీ ప్రవేశపెట్టలేదని ఎందుకంటే ఆ పదవిలో ఉన్నవారు ఎవరూ ధన్కడ్లా వ్యవహరించలేదన్నారు. నిష్పాక్షికంగా, రాజకీయాలకు అతీతంగా నిబంధనల ప్రకారం సభను నడిపారని గుర్తు చేశారు. ధన్కడ్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ బీజేపీ అధికార ప్రతినిధిలా నడుచుకుంటున్నారని అందుకే దేశ చరిత్రలో తొలిసారిగా తప్పని పరిస్థితుల్లో రాజ్య సభ చైర్మన్‌ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు.