సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. అల్లు అర్జున్ అరెస్ట్
హైదరాబాద్ డిసెంబర్ 13 (ప్రజాక్షేత్రం):ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన పుష్ప-2 ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. అయితే, అదే సమయంలో ప్రిమియర్ షో చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్ నుంచి రేవతి (39), భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్ (9), సన్వీక (7) సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా, కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ తొక్కిసలాట ఘటనపై చిక్కడిపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. తాజాగా, ఈ కేసులో ఇవాళ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.