డిజిటల్ మీడియా కు చట్టబద్ధత కల్పించాలి
-డి ఎం జె యూ ఆధ్వర్యంలో కలెక్టర్ కు, డీపీఆర్ఓ కు వినతి పత్రం
-డి ఎం జె యూ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద శ్రీనివాస్
-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్
మహబూబాబాద్ డిసెంబర్ 13 (ప్రజాక్షేత్రం):డిజిటల్ మీడియా జర్నలిస్టుల కు చట్టబద్ధత కల్పించాలని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ అన్నారు. శుక్రవారం డి ఎం జె యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రాజేంద్రప్రసాద్ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి చంద శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ మాట్లాడుతూ…డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సామాజిక భద్రత కొరవడిందని ఆవేదన చెందారు. అంతే కాకుండా ప్రభుత్వం నుండి ఆదరణ కూడా కరువైందని, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా డిజిటల్ మీడియా జర్నలిస్టులు వార్తలను సేకరించి ఎప్పటికప్పుడు క్షణాలలో డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారాన్ని చెరవేస్తున్నారని గుర్తు చేశారు. డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా మంది తెలంగాణ ఉద్యమ వార్తలను కవరేజ్ చేసిన వాళ్ళే, హక్కుల సాధనకోసం డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ పనిచేస్తుందన్నారు. ఐక్యత, ఆచరణ నినాదంతో రెండు తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ మీడియా ముందుకు పోతుందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టులుగా గుర్తించాలన్నారు. డిజిటల్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రైవేటు విద్యా సంస్థలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. అలాగే అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. సామాజిక భద్రత కోసం మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. పైన తెలిపిన, తదితర డిమాండ్ ల సాధనకోసం డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ కృషి చేస్తుందని, సమస్యలని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఎం జె యూ జిల్లా నాయకులు కల్లూరు ప్రభాకర్, పోరండ్ల లక్ష్మయ్య, బండారి పవన్, మాదాసి మహేష్, నక్క హరీష్ తదితరులు పాల్గొన్నారు.