మెదక్ చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
మెదక్ డిసెంబర్ 13(ప్రజాక్షేత్రం): 800 క్వింటాళ్ల భారీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మెదక్ జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి ఆర్‌టీఏ చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. భారీ ఎత్తున గంజాయిని ముంబైకి తరలిస్తుండగా పూణె, గోవా రాష్ట్రాలకు చెందిన డిఆర్‌ఐ స్పెషల్‌ఫోర్స్ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ముంబైలో గంజాయి ఎవరికి సరఫరా చేస్తున్నారో అనే విషయం తెలుసుకునేందుకు డిఆర్‌ఐ స్పెషల్ ఫోర్స్ గంజాయి తరలిస్తున్న లారీని వెంబడించారు. పోలీసులు తమను వెంబడించడాన్ని గమనించిన లారీ డ్రైవర్ చాకచాక్యంగా చెక్‌పోస్ట్ వద్ద లారీ ఆపి, కాగితాలు చూపించి తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. లారీ వద్ద ఉన్న డిఆర్‌ఐ అధికారులు, చెక్‌పోస్ట్ సిబ్బంది చాలాసేపు వేచిచూసినా డ్రైవర్ రాకపోవడంతో లారీని చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ లారీని తనిఖీ చేయగా అందులో 800 క్వింటాళ్ల గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.