శంకర్ పల్లి ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాల్లో కొత్త మెనూ షురూ : మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
శంకర్ పల్లి డిసెంబర్ 14(ప్రజాక్షేత్రం):సర్కారు గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా శనివారం శంకర్ పల్లి మండల కేంద్రంలో గల ఎస్సీ బాలికల బాలుర సంక్షేమ వసతి గృహాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి కొత్త కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం ఇటీవల పెంచిందని గుర్తు చేశారు. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత డైట్ చార్జీలు 40%, పదహారేళ్ల తర్వాత కాస్మోటిక్ చార్జీలు 200% పెరగనున్నాయని తెలిపారు. వీటిని నేటి నుంచే ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. డైట్ చార్జీల వివరాలను అందరికీ కనిపించే విధంగా ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించారు. కామన్ డైట్ మెనూ, యూనిఫాం ప్రిపరేషన్ ప్రొసీజర్, స్టాండర్డైజేషన్ ఆఫ్ స్టోరేజ్, కిచెన్, డైనింగ్ ఏరియా మెయింటెనెన్స్ కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. అనంతరం హాస్టల్ లను సందర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విద్యార్థులతో వారు ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో గిరిరాజు, మెడికల్ ఆఫీసర్ డా. రేవతి, కౌన్సిలర్ సంధ్యారాణి అశోక్ కుమార్, మేనేజర్ అంజని కుమార్, వార్డెన్లు జయప్రద,పాండు, వార్డు ఆఫీసర్లు ఉన్నారు.