వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లులపై కేంద్రం పునరాలోచన
న్యూఢిల్లీ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. తాజాగా లోక్ సభ బిజినెస్ జాబితా నుంచి రెండు బిల్లులు తొలగించారు. తొలుత రేపు లోక్ సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఆ మేరకు లోక్ సభ బిజినెల్ లో కూడా కేంద్రం పొందుపరిచింది. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ బిల్లులు పెడతారని కేంద్రం పేర్కొంది. రివైజ్డ్ చేసిన లోక్ సభ బిజినెస్ లో జమిలి ఎన్నికల బిల్లులు లేవు. ఈ నెల 20తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. తాజా పరిణామాలతో ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. డిసెంబర్ 12న ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. క్యాబినెట్ రెండు ముసాయిదా చట్టాలను ఆమోదించింది. వీటిలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించినది, రెండవ బిల్లు అసెంబ్లీలతో కూడిన మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏకకాల ఎన్నికలకు సంబంధించినది. మొదటి బిల్లు రాజ్యాంగ సవరణను కోరుతున్నందున, బిల్లును ఆమోదించడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం, రెండవ బిల్లుకు సభలో సాధారణ మెజారిటీ అవసరం.