భూమిలేని నిరుపేదలకు సర్కార్ తీపికబురు
హైదరాబాద్, డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం): భూమిలేని నిరుపేదలకు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో భూమిలేని నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఈనెల 28న తొలి విడత కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6వేలు జమ అవుతాయని భట్టి ప్రకటించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి భట్టి శ్రీకారం చుట్టారు. వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు అందిస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయానికి రూ.50,953 కోట్లు రైతుల కోసం ఖర్చు చేసిందని భట్టి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ కోసం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేసిందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు చెప్పుతూ ప్రజాలను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఇరిగేషన్, ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, ఆసుపత్రులు, ఉద్యోగుల జీపీఎఫ్, మిడ్ డే మీల్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర బకాయిలు రూ.40,154 కోట్లు ఉన్నాయని తెలిపారు. గత పాలకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.7,11,911 కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజలపై మోపిందని ఆగ్రహించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పుకు ఈ ఏడాది ప్రజా ప్రభుత్వం రూ.66,782 కోట్లు వడ్డీలు చెల్లించిందన్నారు. సన్నాలపై క్వింటాకు ఇస్తున్న రూ.500 బోనస్ ద్వారా ప్రతి ఏకరాకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకు రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.