జకీర్ హుస్సేన్ కన్నుమూత
హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం): ప్రఖ్యాత తబలా విద్వాంసులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఆరోగ్యం విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. తబలా మ్యాస్ట్రోగా ప్రసిద్ధి చెందిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు.1990లో సంగీత నాటక అకాడమి అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో.. ఆయన ఎంతో మంది అంతరాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.