మంచు కుటుంబంలో మళ్లీ వివాదం..
హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం): మంచు కుటుంబంలో వివాదం ముగియలేదు. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. మనోజ్ తాజా స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం. శనివారం తన ఫ్యామిలీలో చోటుచేసుకున్న ఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. ‘‘నిన్న నేను సినిమా చిత్రీకరణలో ఉన్నాను. కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో.. నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతోపాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లలో షుగర్ పోయించాడు. దాంతో, రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మేమంతా ఆందోళనకు గురయ్యాం. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. అక్కడే గ్యాస్ కనెక్షన్ ఉంది. విష్ణు టీమ్ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నా దంగల్ కోచ్‌ను బెదిరించింది. అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం హృదయాన్ని కలచివేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని మనోజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.