Praja Kshetram
తెలంగాణ

జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలి

జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలి

 

-ఏకసభ్య కమిషన్ కు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి..

హైదరాబాద్ డిసెంబర్ 17 (ప్రజాక్షేత్రం):హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ అమలును అధ్యయనం చేయడానికి నియమితులైన ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు వినతులతో కూడిన నివేదికను వారికి సమర్పించడం జరిగింది. రాజ్యాంగంలో రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికనే నిర్ధారించడం జరిగిందని అదే మాదిరిగా ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అందేలా వర్గీకరణను అమలు చేయాలని సూచించడం జరిగింది. ఉమ్మడి రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన ఎలా అయితే నిర్ధారించారో అదే విధంగా ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణను కూడా జనాభా ప్రాతిపదికననే నిర్ధారించాలని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా 70 శాతం ఉందని అన్నారు. కనుక పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలకు 70% వాటాను కేటాయించాలని కోరడం జరిగింది. మాదిగల జనాభాకు తగినట్టుగా విద్యా ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఈ అన్యాయం తొలగిపోవాలంటే ఎస్సీ వర్గీకరణ మాత్రమే పరిష్కారం అని అన్నారు. మాదిగలు తమ జనాభా నిష్పత్తి కనుగుణంగానే వాటాను కోరుతున్నారే తప్ప ఇతరుల వాటాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎస్సీలలో ఉన్న ప్రతి కులాన్ని స్వతంత్రంగానే గుర్తించాలని, ఏ కులానికి, ఆ కులం స్వతంత్రంగా ఉండాలో లేదా ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికే వదిలేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎం ఎస్ పి నాయకులు సొట్ట నరేందర్ బాబు, వి ఎస్ రాజు,ఎం ఎస్ ఎఫ్ నాయకులు కోమ్ము శేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related posts