తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు..!!
తెలంగాణ బ్యూరో (ప్రజాక్షేత్రం):తెలంగాణలో 2024 సంవత్సరం రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. అధికారం లోకి వచ్చిన తరువాత రేవంత్ 2024 లో రేవంత్ తన మార్క్ పాలన చూపించారు. బీఆర్ఎస్ పూర్తిగా ఈ ఏడాది ఆత్మరక్షణలో కనిపించింది. బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలవటంతో భవిష్యత్ పైన ఆశలతో కనిపిస్తోంది. ఇక..కవిత అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైడ్రా ..మూసీ వివాదాల చుట్టూ రాజకీయాలు తిరిగాయి. తెలంగాణ రాజకీయాల్లో 2024 బిగ్ టర్న్ గా మారింది.
కలిసొచ్చెందెవరికి
2024 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది రాజకీయంగా తెలంగాణలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 చివర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నూ బలం చాటుకుంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 ఎంపీ సీటు కైవసం చేసుకున్నాయి. బీజేపీ మూడు ఎంపీ సీట్ల నుంచి 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవ లేకపోయింది. దీంతో, కాంగ్రెస్ – బీజేపీ ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలుగా కనిపిస్తున్నాయి.
కవిత అరెస్ట్ తో
2024 లో కవిత అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీ మద్యం కేసులో కవిత ను ఈడీ మార్చి 15న అరెస్ట్ చేసింది. 165 రోజులు జైలు జీవితం అనుభవించిన కవితకు సుదీర్ఘ పోరాటం తరువాత సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోవటం.. ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ వీడటం తో బీఆర్ఎస్ బలహీన పడింది. కేసీఆర్ పూర్తిగా మౌనం దాల్చారు. పార్టీ సమావేశాలు మినహా, పార్ల మెంట్ ఎన్నికల ప్రచారం తరువాత ఎక్కడా కనిపించ లేదు. కాంగ్రెస్ పైన వ్యతిరేక ఉందని పార్టీ నేతలకు చెబుతున్న కేసీఆర్.. ప్రజాక్షేత్రంలోకి రావటం పైన ఎలాంటి కార్యాచరణ లేదు. అదే విధంగా ఈ ఏడాది కాలంలో ఒకే ఒక్క రోజు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చారు.
బీఆర్ఎస్ కు చేదు ఫలితాలు
గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి మారిన వారి పైన అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ నేతలు న్యాయ పరంగా పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కేసీఆర్ మౌనంతో పార్టీలో కేటీఆర్, హరీష్ కీలకంగా మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది కాలంలో తమ స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు చేసింది. సీఎం రేవంత్ తన మార్క్ చూపించేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా.. గతం కంటే బాగా పుంజుకంది. బీఆర్ఎస్ ను సున్నాకు పరిమితం చేసింది. ఇక, రాష్ట్రంలో బీజేపీ తో హోరా హోరీ తల పడుతోంది.
కొత్త వ్యూహాలతో
రైతు రుణమాఫీ అమలు ద్వారా కీలకమైన ఎన్నికల వాగ్దానం రేవంత్ అమలు చేసారు. హైడ్రా, మూసీ వంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారటంతో..రేవంత్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. బీజేపీ సామాజిక సమీకరణాలే అస్త్రాలు గా తెలంగాణలో బలపడటానికి ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో, మూడు పార్టీలు 2025 లో మరింత గా ఎదిగేలా కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి.