దారుణం.. సినిమా రేంజ్‌లో బ్లాస్టింగ్.. పరుగులు తీసిన ప్రజలు..
గండిపేట డిసెంబర్ 20(ప్రజాక్షేత్రం): కోకాపేట్ లో డిటోనేటర్ల బ్లాస్టింగ్ కలకలం రేపింది. నియో పోలీస్ వద్ద స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓ నిర్మాణ సంస్థ డిటోనేటర్లు పెట్టి పెద్దఎత్తున బండరాళ్లను పేల్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 చోట్ల డిటోనేటర్ల పెట్టి ఆ సంస్థ పేలుడుకు పాల్పడింది. అంత పెద్దస్థాయిలో బ్లాస్టింగ్ జరగడంతో సినిమా రేంజ్‌లో పెద్దఎత్తున బండరాళ్ల ముక్కలు గాల్లోకి లేచాయి. ముందు అదేదో సినిమా షూటింగ్ అనుకున్న స్థానికులు భారీ శబ్దాలతో రాళ్ల ముక్కలు ఒక్కసారిగా తమ వైపునకు రావడంతో పరుగులు పెట్టారు. అయితే వేగంగా దూసుకొచ్చిన రాళ్లు అయ్యప్ప స్వాముల శిబిరంతోపాటు లేబర్ క్యాంప్‌లో పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. అలాగే వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. అతి కష్టం మీద లేబర్ క్యాంప్‌లో ఉన్న కార్మికులు, అయ్యప్ప స్వాములు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ముందు సినిమా షూటింగ్ అనుకున్నామని, భారీగా రాళ్లు గాల్లోకి లేవడంతో ఆశ్చపోయినట్లు స్థానికులు చెప్పారు. తమ వైపునకు అవి రావడంతో సినిమా షూటింగ్ కాదని అర్థమయ్యిందని, వెంటనే ప్రాణ భయంతో పరుగులు పెట్టినట్లు స్థానికులు చెప్పారు. రాళ్లు వచ్చి మీద పడడంతో వంట సామగ్రి మెుత్తం చెల్లాచెదురుగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బ్లాస్టింగ్ చేసిన నిర్మాణ సంస్థపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్‌తోపాటు బీఎన్ఎస్ 125, 91B సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.