భూమి ఒకరిది.. యజమాని మరొకరు.. ఈ తప్పులకు బాధ్యులెవరు.?
హైదరాబాద్ డిసెంబర్ 20 (ప్రజాక్షేత్రం):ధరణి పోతే రైతుల బతుకులు పోతాయంటూ.. అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటనలు చేశారు. పేదల బతుకులు మార్చడంలో ధరణికి మించిన సాంకేతికత లేదని వ్యాఖ్యానించారు. ఇదే పేద రైతుల బతుకుల్ని శాశ్వతంగా మార్చివేస్తుందంటూ ఊగదంపుడు ప్రసంగాలు చేశారు. ఆ విధానాలు, నినాదాలతోనే ప్రజల్లోకి వెళ్లారు. కానీ ప్రజల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ధరణి పేరుతో చిన్నచిన్న సమస్యలకు సైతం పరిష్కారం లభించడం లేదని ఆగ్రహిస్తూ.. రేవంత్ కు జై కొట్టారు. ధరణిని దారుణంగా వ్యతిరేకించారు. ధరణిని తీసివేయాల్సిందే అంటూ ఓటుతో చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ధరణి తొలగింపు, నూతన పోర్టల్ రూపకల్పనకు రేవంత్ పచ్చజెండా ఊపారు.
అసలు.. పేద రైతులు ముఖ్యమా, వేల కోట్ల భూములు ముఖ్యమా అంటే.. కోట్లే ముఖ్యమంటూ అప్పటి నేతలు ముందుకు సాగారు. రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా.. వేల కోట్లను సంపాదించేందుకు ధరణిని సాధనంగా వాడారు. అనేక జిత్తుల ఎత్తుల మధ్య రూపొందిన ధరణి అసలు రూపం ఏంటో తెలుసా.? లేకుండా.. ఈ కథనం మీకోసమే…
ధరణి తీసుకువచ్చేటప్పుడు భూమి రికార్డుల్లో అనేక మార్పు చేర్పులు చేశారు. ఆర్ఓఆర్ కాలమ్స్ తొలగింపులో ఏకపక్షంగా వ్యవహరించారు. కేవలం మూడు నెలల్లోనే తరాల నాటి రికార్డుల బూజు దులిపి డిజిటలైజేషన్ పూర్తి కానిచ్చారు. రికార్డు వేగంతో.. ముందు వెనుక ఆలోచించకుండా ధరణిలో అప్ లోడ్స్ చేసేశారు. ఈ హడావిడిలో అనేక పొరబాట్లు జరిగాయి. ఓ అంచనా ప్రకారం.. దాదాపు 20 లక్షల ఖాతాల్లో వివాదాలు తలెత్తాయి. రోల వ్యవధిలోనే వేలాది రైతుల ఆధార్ సేకరణ, అప్డేడ్లు పూర్తి చేశారు. తీరా చూస్తే.. వందలాది అకౌంట్లకు ఒకే ఆధార్ నంబర్ ని జోడించి.. రైతులకు చుక్కలు చూపించారు. తర్వాత నింపాదిగా రైతుల ఫిర్యాదులతో సరిచేస్తూ.. కాలం వెళ్లదీశారు.
కొత్త పట్టాదారు పాస్ బుక్ లో సరిచేయలేన్నన్ని తప్పులు. యజమానుల పేర్లు మారిపోయాయి. అసలైన యజమానులు పోయి, గతంలో ఎప్పుడో అమ్మేసుకున్న వారి పేర్లతో పాస్ బుక్స్ వచ్చాయి. భూ విస్తీర్ణంలోనూ దారుణాలు.. కమతాల పరిమాణాన్ని తగ్గించి చూపించిన ధరణి పోర్టల్.. వ్యవసాయ భూములు వేరే కేటగిరిలోకి వెళ్లిపోయాయి. ధరణి ఎంట్రితో ఒక్కో గ్రామంలో దాదాపు 100 కు పైగా ఫిర్యాదులు తలెత్తినట్లు తర్వాత గుర్తించారు. ఈ సమస్యలకు తహసీర్దార్, కలెక్టర్లకు సైతం అధికారాలు లేకపోవడంతో అనేక మంది రైతులు మనస్థాపంతో ఉరితాడు బిగించుకున్నారు.
ధరణి సమస్యలపై ఏకంగా రాష్ట్ర హైకోర్టు సైతం స్పందించింది. భూసమస్యలు పరిష్కరించే వ్యవస్థే లేకపోవడంతో.. చిన్నచిన్న వాటికి సైతం సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో.. స్థానిక కోర్టుల్లో రోజూ వందల కేసులు నమోదవుతున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న, సన్నకారు రైతులకు చెందిన భూముల్ని నిషేధిత భూముల జాబితాలోకి చేర్చడంతో.. భూములపై హక్కులు కోల్పోయిన రైతులు లబోధిబోమంటున్నారు. ఈ పొరబాట్లు ఏకంగా కేసీఆర్ నియోజకవర్గంలోనే బయటపడ్డడంతో.. ప్రభుత్వం అంగీకరించక తప్పలేని స్థితి. అలాగే.. పట్టాదారు పాసుపుస్తకాలు అందుకున్న 72 మంది గిరిజనుల పేర్లు రికార్డుల నుంచి మాయం. వీటిని అక్రమంగా తొలగించినట్లు హైకోర్టు గుర్తించి అధికారుల్ని మందలించింది. ఇలా చేయడం వల్ల వందల ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములపై హక్కుల్ని కోల్పోయారని ఇది మంచి పద్దతి కాదంటూ ఆగ్రహించింది. ఇలా.. ధరణి సమస్యలు ఎన్నో, ఎన్నెన్నో.