వనపర్తికి స్వర్ణోత్సవ శోభ..!
-50 ఏళ్లు పూర్తిచేసిన డిగ్రీ కళాశాలలో వేడుకకు పూనుకున్న పూర్వ విద్యార్థులు
-దేశ విదేశాల నుండి హాజరవుతున్న పూర్వ విద్యావంతులు
-ఆకస్మిక షెడ్యూల్ తో రద్దయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక
వనపర్తి డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం): రాజ వంశీయుల కాలం నుండి విద్యకు నిలయంగా వెలుగుతున్న వనపర్తికి స్వర్ణోత్సవ శోభ సంతరించుకోనుంది. వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు పూనుకోవడంతో దేశ నలుమూలల్లో స్థిరపడిన విద్యావంతులు, విదేశాల్లో రాణిస్తున్న పూర్వ విద్యార్థులు సైతం ఈ వేడుకలకు హాజరుకానుండటంతో స్వర్ణోత్సవ శోభతో అక్షర పరిమళాలు వికసించనున్నాయి. రాణి లక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాలగా మొదట్లో ఇక్కడ ప్రారంభించి విద్యకు రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో టైపు కృష్ణయ్య తో పాటుగా అనేక పోరాటాలు కొనసాగించడంతో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య చొరవతో రాని లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. సువిశాలమైన ప్రాంతంలో ఏర్పాటు అయిన ఈ కళాశాలలో డిమాండ్ కు అనుగుణంగా విద్యా అవకాశాలు, అవసరాలకు తగ్గట్టుగా నూతన కోర్సులతో విరాజిల్లుతోంది. ఒక 20 నుంచి 25 ఏళ్ల క్రితం రాష్ట్రస్థాయిలో ఏ డిగ్రీ కళాశాలలో సీటు లభించినా దక్కని ఉత్సాహం వనపర్తిలో లభిస్తే అదృష్టంగా భావించేవారు. వనపర్తి లో విద్యను అభ్యసించేందుకు వనపర్తి నుంచే కాక గద్వాల, మహబూబ్నగర్, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, మెదక్, కర్నూల్ తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవారు. అంతేకాకుండా హైదరాబాద్ నుండి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ వనపర్తి లో విద్యనభ్యసించిన విద్యార్థులు ఎందరో ఉన్నారు.
ఉన్నత స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు…!
వనపర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి 50 అవుతున్నప్పటికీ ఆ క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనపర్తి నుంచే కాకుండా ఇతర జిల్లాల విద్యార్థులు నేటికీ విద్యను అభ్యసిస్తున్నారు. వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివి రాజకీయ నాయకులుగా, న్యాయవాదులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, న్యాయమూర్తులుగా, ఐఏఎస్, ఐపీఎస్, లెక్చరర్లుగా స్థిరపడడంతో పాటుగా దేశ విదేశాల్లోనూ రాణిస్తూ వనపర్తి ఘనతను చాటి చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్వర్ణోత్సవ వేడుకలను భవిష్యత్తు తరాలకు, నేటి విద్యార్థులకు, యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు ఈ స్వర్ణోత్సవ వేడుకలను ఆర్గనైజర్లు 9 రకాల కమిటీలను వేసి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇందుకోసం గత ఏడాది, రెండేళ్ల కాలం నుండి విస్తృతంగా చర్చలు జరుపుతూ దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను కమ్యూనికేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. స్వర్ణోత్సవ వేడుకలను ఎలాగైనా జరిపి తీరాలనే దృఢ సంకల్పంతో మరీ ముఖ్యంగా ఆరు నెలల నుంచి కార్యక్రమాన్ని ఒక కొలిక్కి తెచ్చారు. దీంతో స్థాయి, హోదాలను మరిచి పూర్వ విద్యార్థులుగా చదివిన కళాశాలకు స్వర్ణోత్సవం చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వనపర్తి తో అనుబంధం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యేందుకు అధికారికంగా షెడ్యూల్ ఖరారు అయినప్పటికీ అనివార్య కారణాలతో ముఖ్యమంత్రి రాక వాయిదా పడింది. అయినప్పటికీ దేశ విదేశాల నుంచి వచ్చే వారి ఉత్సాహాన్ని నిరుత్సాహ పరచకుండా కార్యక్రమాన్ని నేడు యధావిధిగా కొనసాగించేందుకు ఆర్గనైజర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
చదివిన చోటే బోధకులు
రాణి లక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40,50 ఏళ్ల కిందట చదివిన పూర్వ విద్యార్థులు నేడు అధికారికంగా ఇదే కళాశాలలో బోధకులుగా విధులు నిర్వర్తిస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చదివిన కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే 10 ఏళ్లు, 20 ఏళ్లు కాకుండా 50 ఏళ్ల తర్వాత తోటి చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం దక్కుతుందని వారు తెగ ఆనంద పడుతున్నారు.